తక్కువ ఖర్చుతో ప్రాణాంతక వ్యాధులకు చికిత్స అందించేందుకు వివిధ పరిశోధనలు జరుగుతున్నాయని, అందుకు 10 ప్రాజెక్టులకు పరిశోధనల బాధ్యతలను అప్పగించినట్లు అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్లో జరిగిన రాష్ర్ట సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ మధ్యంతర సమీక్షా సమావేశంలో మంత్రి జోగు రామన్న సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం అత్యంత ఖరీదుగా మారిన వైద్య పరీక్షలను ప్రజలకు చౌకగా అందించేందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ తరఫున కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. క్యాన్సర్, కిడ్నీ, మైగ్రెన్, బీ-తలసేమియా వంటి ప్రాణాంతక వ్యాధులకు తక్కువ ఖర్చుతో వైద్యం ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. వివిధ వ్యాధుల పరిశోధనల బాధ్యతలను ప్రతిష్ఠాత్మక సంస్థలకు అప్పగించామన్నారు.
