తెలంగాణ ఓస్తే ఏమొచ్చింది..ఇగో 30 ఏండ్ల తరువాత కృష్ణా జలాలతో “గణప సముద్రం” నిండుగా దర్శనం ఇస్తుంది
అవును మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఘనపురం బ్రాంచి కెనాల్ ద్వారా వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని గణప సముద్రం ముప్పై ఏండ్ల తర్వాత కృష్ణా జలాలతో నిండుతుంది
గుండెలో తడుంటే బండైనా చెలిమైతది స్పందించే మనసుంటే సముద్రమైనా చనుపాలిస్తది!
ఎన్నేండ్లు దు:ఖాన్ని దుసిపోసుకున్నం ఎన్ని సంక్రాంతులు మంట్ల గల్సినవి ఎన్ని మల్కలు మమ్మల్ని మేమే అమ్ముకున్నం!
బిడ్డలే గాదు విత్తనాలూ గర్భస్రావాలైనవి ర్యాలపూతల్లా రైతులు రాలిపోయి నుదుర్లు నేలకు గుద్దుకొని బొడబొడ రక్తం మడుగైతే ఒక్క పావురమన్న కన్నీటిబొట్టు రాల్చలే ఏ దయామయుడి మనసు చెమ్మగిల్లలే!
నదులు ఉప్పొంగి వాగుల నడుములిరిగి జలప్రళయాల బీభత్సంతో చేసి దేశమంతా జలమయమై లక్షల క్యూసెక్కుల నీళ్లు బురదపాల్జేసిన రాజకీయ చిత్రాలు పచ్చి పాలసముద్రం లాంటి చెరువు పగిలిన కుండయింది నీటిబొట్టు లేక బోర్లిచ్చిన బండయ్యింది!
కరువులు కోలాటాలేసినవి ఆకలిచావులు బొడ్డెమ్మలాడినవి రుతుపవనాలు వాయుగుండాలు వంకుడు దుంకుడు లాడినా ఒక్క చినుకన్న చెరువు గొంతు తడుపలే!
ఎగిరిన పాల పిట్టలను కరెంటు తీగలు చుట్టుముట్టినవి పురుగు మందులు పెరుగుబువ్వలై లొట్టపీసాకులు విందులై వెన్నెముకలన్ని కాటిలో కుప్పయి ఊర్లు కమురు కుంపట్లయినవి!
ముప్పై ఐదడుగుల ఎత్తు మూడు కిలోమీటర్ల వైశాల్యం కోటలు, గిరిదుర్గం, ఖిల్లాల నడుమ ఇంద్ర ధనుస్సులా జలాశయం రెండున్నరవేల ఆయకట్టు ఒక్కసారి నిండితే ముక్కారు పంట చేతిలున్నట్లే కాకతీయుల స్వప్నం గుండదండధీశుడి గుండెతడి గణప సముద్రం కాలాన్ని పలుగు పార చేసి రాత్రి పగలుని పనిలో ఒంపి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అపర భగీరథుడు!
చెరువు అలుగెల్లి ముప్పైనాలుగేండ్లు దాటె నీళ్ళను మల్ల కండ్ల చూస్తమనుకోలే కృష్ణాజలాల నీళ్ళు గలగల భూపాలరాగమై పడమరన పొద్దెక్కుతుంటే సంతోషం అలుగుదుంకుతున్నది నీళ్లు బీళ్లను ముద్దాడుతుంటే పొలాలు పొన్న పువ్వులై నవ్వుతున్నవి నది నీటిని మలుపడం యుద్ధాన్ని గెలువడమే!
(మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఘనపురం బ్రాంచి కెనాల్ ద్వారా వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని గణప సముద్రంముప్పై ఏండ్ల తర్వాత కృష్ణా జలాలతో నిండుతున్న సందర్భంగా…)
– వనపట్ల సుబ్బయ్య,
నమస్తే తెలంగాణ దినపత్రికనుండి