తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి 1500 మంది రైతులు, టీఆరెస్ శ్రేణులు రేపు ( 11.02.18 ఆదివారం) స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో తరలివెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.లక్షా 20 వేల కోట్ల వ్యయం తో కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే మంచి ఉద్దేశంతో నిర్మిస్తోంది. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో ..భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సారథ్యంలో రేయింబవళ్లు ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరుగుతోంది.
ఈ ప్రాజెక్టు నిర్మాణం పై హుస్నాబాద్ మెట్ట ప్రాంత రైతులు, ప్రజానీకం ఆశగా ఎదురు చూస్తున్నారు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణం చూడాలన్న తపన, ఆసక్తి వారిలో ఉంది. కాళేశ్వరం నుండి నీటిని మిడ్ మానేరుకు అక్కడినుండి నియోజకవర్గంలోని గండిపల్లి, గౌరవెల్లి ప్రాజెక్టులకు సరఫరా చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు హుస్నాబాద్ ప్రాంత రైతులకు సాగునీటి తో పాటు తాగునీటి కష్టాలు తీర్చనుంది. నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాలు, మండలాల నుండి 30 బస్సులతో పాటు ఇతర వాహనాలు ఏర్పాటు చేసారు. ఆదివారం ఉదయం 5 గంటలకే రైతులు టీఆరెస్ శ్రేణులు 1500 మంది కాళేశ్వరం ప్రాజెక్టు చూసేందుకు తరలి వెళ్లనున్నారు. కాళేశ్వరం తో పాటు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ ప్రదేశాలను రైతులు, టీఆరెస్ నాయకులు చూడనున్నారు. ప్రాజెక్టును చూసేందుకు ఆసక్తి ఉందని, ప్రాజెక్టు నిర్మాణం చూడడం గొప్ప అనుభూతి గా గుర్తుండి పోతుందని వారు పేర్కొన్నారు