తాజాగా విడుదలైన ‘గాయత్రి’ సినిమాలో మోహన్ బాబు పలికిన డైలాగ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్టాల్లో హాట్ టాపిక్ గా మారింది. ‘ఒకడేమో బీకామ్‌లో ఫిజిక్స్ చదివానంటాడు.. ఇంకొకడేమో నా పెన్షన్ తీసుకుంటున్నావ్, నా రోడ్ల మీద నడుస్తున్నావ్, ఓటు నాకే వేయాలంటాడు, ఇంకోడేమో సార్వభౌమాధికారం అని పలకలేక భౌభౌఅంటాడు..’ అంటూ టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకునే మోహన్ బాబు తన సినిమాలో ఈ డైలాగ్ పెట్టించారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ డైలాగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.హాట్ పొలిటికల్ కామెంట్స్ చేయడానికి వెనుకాడే రకం కాదు మోహన్ బాబు.
ఈ డైలాగులు ఎవరిని ఉద్దేశించినవో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు. వార్తల్లోని అంశాలనే సెటైరిక్ డైలాగ్ గా మార్చారు.తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘బీకామ్ లో ఫిజిక్స్ చదివా..’ అని అనడం నేషనల్ లెవల్లో చర్చనీయాంశం అయ్యింది. ఎమ్మెల్యే హోదాలోని ఒక వ్యక్తి బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందని వాదించడం.. అందుకు సంబంధించిన వీడియో దేశ వ్యాప్తంగా నెటిజన్ల మధ్య షేర్ అయ్యింది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నంద్యాల ఉప ఎన్నికలకు ముందు.. నేనిస్తున్న పెన్షన్ తీసుకుంటారు, నేను వేసిన రోడ్లపై నడుస్తున్నారు.. ఓటు కూడా నాకే వేయాలి… అని అనడం వివాదంగా నిలిచింది. జాతీయ వార్తా చానళ్లలో కూడా అందుకు సంబంధించిన వీడియోలు ప్రసారం అయ్యాయి.ఇక నారా లోకేష్ బాబు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేస్తూ.. ‘సార్వభౌమాధికారం’ అనే మాటను పలకడానికి ఇబ్బంది పడ్డారు. ఈ విధంగా మోహన్ బాబు గాయత్రిలో పేల్చిన డైలాగ్ టార్గెట్ అంతా టీడీపీ నేతలనే అనిపిస్తున్నారు.