ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో గుంతలతో ,ఎత్తు వంపులతో ఉన్న క్రికెట్ ప్రాంగణం నేడు అంతర్జాతీయ మ్యాచ్ ల నిర్వహణకు అణువుగా మారింది. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చొరవతో 9 కోట్ల రూపాయల వ్యయంతో సిద్దిపేటలో మినీ స్టేడియం నిర్మించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు కల్పించారు. హెచ్ సీఏతో ప్రత్యేకంగా చర్చించి స్టేడియాన్ని అద్భుతంగా తయారు చేశారు. రూ. 17 లక్షలతో స్టేడియంలో గడ్డి, రూ. 50 లక్షల వ్యయంతో ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేశారు. ఇక స్టేడియానికి అనుబంధంగా రూ. 5 కోట్ల ఖర్చుతో స్విమ్మింగ్ పూల్, రూ. 2.5 కోట్ల ఖర్చుతో ఇండోర్ స్టేడియం, రూ. 50 లక్షల ఖర్చుతో వాలీబాల్ కోర్ట్, రూ. 30 లక్షల ఖర్చుతో షటిల్ కోర్ట్, బాస్కెట్ బాల్, టెన్నిస్ కోర్టులు ఏర్పాటు చేశారు.బీసీసీఐ గుర్తించిన మెగాటోర్నీ తమ జిల్లా కేంద్రంలో జరగడంపై ప్లేయర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జి. వెంకటస్వామి మెమోరియల్ టీ20 క్రికెట్ లీగ్ రెండో ఫేజ్ టోర్నీకి సిద్దిపేట వేదికైంది. ఇప్పటి వరకు మేజర్ టోర్నీలన్ని హైదరాబాద్ లో నిర్వహించిన హెచ్‌సీఏ తొలిసారి సిద్దిపేటలో క్రికెట్ టోర్నీ నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు ఈ టోర్నీ అలరించనుంది. మంత్రి హరీశ్ రావు ఈ పోటీలను ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ మ్యాచ్ లకు సినీ హిరోలు వెంకటేష్ తో పాటు రంగారెడ్డి రాయల్స్ కు ఆడుతున్న అఖిల్ అక్కినేని, మెదక్ టీమ్ బ్రాండ్ అంబాసిడర్లు తరుణ్, శ్రీకాంత్ సిద్దిపేట స్టేడియంలో సందడి చేయనున్నారు