ప్రపంచ క్రికెట్‌లో శ్రీలంక పేసర్ లసిత్ మలింగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. విభిన్నమైన బౌలింగ్ శైలితో పదునైన యార్కర్లు, స్వింగ్ బంతులు వేసే మలింగ.. బ్యాట్స్‌మెన్ పాలిట సింహస్వప్నమే. శ్రీలంక జట్టు ఆటగాడైనా భారత్‌లో ఎంతో మంది ఫ్యాన్స్ అతని సొంతం. ముంబై ఇండియన్స్ తరపున ఆడే ఈ బౌలర్ ఇక క్రికెట్ ఆడనని సంచలన నిర్ణయానికి వచ్చాడు. త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తా అంటున్నాడు. తాజాగా మలింగ ముంబయి ఇండియన్స్ బౌలింగ్ మార్గనిర్దేశకుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘క్రికెట్‌కు దూరం అయ్యేందుకు మానసికంగా సిద్ధమవుతున్నా. భవిష్యత్తులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలన్న దాని గురించి ఆలోచించడం లేదు. నా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాను. అందరూ ఏదో ఒక రోజు ఆటకు దూరం కావల్సిన వారే’ అని మలింగ అన్నాడు.
‘దీనిపై ఇంకా శ్రీలంక క్రికెట్ బోర్డుతో మాట్లాడలేదు. దేశవాళీ క్రికెట్ ఆడేందుకు నా శరీరం ఏ విధంగా సహకరిస్తుందో చూడాలి. ఐపీఎల్‌లోనూ నా కెరీర్ ముగిసింది. ముంబయి ఇండియన్స్‌తో కలిసి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాను. మళ్లీ ఆడాలని మాత్రం అనుకోవట్లేదని మలింగ అన్నాడు.