ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తొలుత కాంగ్రెస్ సీనియర్ గులాం నబీ ఆజాద్ బీజేపీ సర్కార్ పై వ్యాఖ్యలు చేశారు. విపక్షాల గొంతునొక్కి బీజేపీ ప్రభుత్వం వ్యవస్థను మ్యానేజ్ చేస్తున్నప్పుడు ఈ సభలు ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడంతో పాటు, సభలో గట్టిగా మాట్లాడేవారి పై సీబీఐ, ఇన్ కం టాక్స్, ఈడీ వంటివారితో దాడులు చేయించడం ఇలా ఒకటేమిటి మోదీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేయాలో అన్ని చేస్తుందంటూ ఆరోపించి మరీ కాంగ్రెస్ నేతలు సభను బహిష్కరించారు.
అయితే కాంగ్రెస్ నేతల చర్యలకి బీజేపీ నుండి కౌంటర్ వస్తుందనుకుంటే.. నిండు సభలో ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ భలే ట్విస్ట్ ఇచ్చి కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చింది. దేశంలో ప్రతిష్టాత్మకంగా భావించే దర్యాప్తు సంస్థలను.. తమ సొంత అవసరాలకు ఉపయోగించుకొని రాజకీయ ప్రత్యర్ధులను లొంగదీసుకోవడం మొదట స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీయే అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. అందుకు ఉదాహరణలు కూడా చూపిస్తూ.. వైసీపీ అధినేత జగన్ పైనా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పైన నాడు కాంగ్రెస్ బనాయించిన తప్పుడు కేసులు ప్రతి ఒక్కరికి తెలుసని అన్నారు. అయితే భూమి గుండ్రంగా తిరుగుతున్నట్టు.. నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యాపకాలు రివర్స్ కొట్టి.. ఇప్పడు తమదాకా వచ్చాకా కాంగ్రెస్‌కి తెలిసివచ్చిందా అని ప్రశ్నించారు. ఇక ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ.. ఏపీకి ఖచ్ఛితంగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని విభజన చట్టంలో ఉన్న అంశాలకు విలువ ఇవ్వకపోతే ఎలా అని నిలదీశారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్రం తీరని కష్టాల్లో ఉందని.. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఆదుకోకపోతే తీవ్రంగా నష్టపోతామని చెప్పారు. ఇక కేవీపీ ప్రత్యేక హోదాపై ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్ ఆర్ధిక అంశాలు ముడిపడి ఉన్నాయంటూ తిరస్కరణకు గురికావడం పై కూడా విజయసాయి రెడ్డి విమర్శల వర్షం కురిపిస్తూ.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.