మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు(71) మృతి చెందారు. కాగా, అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి కన్ను మూశారు. అయితే, గాలి ముద్దుకృష్ణమనాయుడు పుత్తూరు నుంచి ఆరుసార్లు శాసన సభకు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. అంతేకాకుండా, ముద్దు కృష్ణమనాయుడు విద్య, అటవీశాఖ, ఉన్నత విద్య మంత్రిగా సేవలందించారు.
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంకు చెందిన గాలి రామానాయుడు, రాజమ్మ దంపతులకు 1947 జూన్ 9న ముద్దు కృష్ణమనాయుడు జన్మించారు. ముద్దు కృష్ణమనాయుడకు భార్య సరస్వతి, ఇద్దరు కుమార్తెలు, కుమారులు ఉన్నారు. ఆయన మృతి విషయం తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్దుకృష్ణమ అంత్యక్రియలను స్వగ్రామంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.