బిందెడు నీళ్ల కోసం పుట్టెడు కష్టాలకోర్చిన మేడ్చల్ జిల్లాకు మంచి రోజులొచ్చాయి. ఇంటింటికీ తాగునీళ్లిస్తేనే మళ్లీ వచ్చి ఓట్లడుగుతానని శపథంబూనిన నేత మొదలుపెట్టిన భగీరథ కార్యం జిల్లాలో 100 శాతం సఫలమైంది. మేడ్చల్ జిల్లా గొంతు తడిపేందుకు, ఆడబిడ్డల కన్నీళ్లు తుడిచేందుకు సుమారు 270 కి.మీ. దూరానపారే గోదారమ్మను మేడ్చల్‌కు మోసుకొచ్చింది మిషన్ భగీరథ. గజ్వేల్‌లో మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగానే గజ్వేల్ తరువాత భగీరథ జలాలు మేడ్చల్ జిల్లా పల్లెప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకాన్ని 26 సెగ్మెంట్‌లుగా విభజించగా, వీటిలో 100 శాతం పూర్తయిన మొదటి ప్రాజెక్టు మేడ్చల్ కావడం విశేషం. ఎన్నికల మ్యానిఫెస్టోలో లేకున్నా.. తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ కానుకగా అతి త్వరలో ప్రారంభమవుతున్న సందర్భంగా మేడ్చల్ సెగ్మెంట్ మిషన్ భగీరథ పథకంపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం.
104 గ్రామాలకు.. 45,449 కుటుంబాలకు లబ్ధి
2015 డిసెంబర్ మొదటివారంలో జిల్లాలో మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు అవసరమైన నిధులను కూడా విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి అనుమతులను సాధించారు. అలాగే జిల్లాలో రైతులను ఒప్పించి సుమారు 40.40 ఎకరాల వ్యవసాయ భూములను సేకరించారు. దీంతో కేవలం ఏడాదిన్నరలోనే మేడ్చల్ జిల్లాలో ఇంటింటికీ నల్లానీరు పథకం ఆవిష్కృతమైంది. ఇప్పటికే 2016 ఏప్రిల్ నుంచి మేడ్చల్ నగర పంచాయితీ పరిధిలో 10,000 కుటుంబాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతుండగా, ట్రయల్న్‌ల్రో భాగంగా సుమారు ఆరునెలలుగా 104 గ్రామాల్లో గోదావరి నీటిని అందిస్తున్నారు. 2018 ఫిబ్రవరి రెండోవారంలో జిల్లా పరిధిలోని ఔటర్ రింగ్‌రోడ్డు వెలుపల ఉన్న మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని 5మండలాలు, 104 గ్రామాలకు చెందిన 45,449 కుంటుంబాలకు గోదావరి నీరు అందుతుంది.
see also : ఎంపీ కవిత మానవత్వానికి హ్యాట్సాప్..!
ఇంటింటికీ ఇంటర్నెట్
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు జిల్లాలో మిషన్ భగీరథ పైపులైన్లతో పాటు సుమారు 552 కి.మీ.మేర ఫైబర్ కేబుల్స్‌ను వేయించారు. ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు టీవీ కేబుల్, ల్యాండ్‌లైన్ ఫోన్ కేబుల్ వసతి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఫైబర్ కేబుల్స్‌ను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. మేడ్చల్ జిల్లాలో మిషన్ భగీరథ పథకం అమలులో భాగంగా భౌగోళిక స్వరూపంపై సంపూర్ణ అధ్యయనం చేసిన ఇంజినీరింగ్ అధికారులు అద్భుతమైన డిజైన్లను సమకూర్చారు. ఇందులో ముఖ్యంగా అత్యంత ఎత్తైన కొండల ప్రాంతాల్లో రిజర్వాయర్లు (సముద్రమట్టానికి 622 మీటర్ల ఎత్తులోని గిర్మాపూర్, డబీల్‌పూర్ రిజర్వాయర్లు), సంపుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టడంతో 75-80శాతం వరకు విద్యుత్ వినియోగం లేకుండానే కేవలం గ్రావిటీ ద్వారానే ఇంటింటికి నీరు సరఫరా చేయగలుగుతున్నారు. కేవలం 25 శాతం 0.119 మెగావాట్స్ విద్యుత్ వినియోగిస్తూ పంపింగ్ కొన్ని గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇది మేడ్చల్ జిల్లా మిషన్ భగీరథ సెగ్మెంట్ ప్రత్యేకతగా ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. కాగా, దీనిని ఈ నెల 12న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.మేడ్చల్‌లో నిర్మించిన 1000 కేఎల్ రిజర్వాయర్ వద్ద అధికారులు ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం ప్రజలనాడి తెలిసిన నాయకుడు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలనాడి తెలిసిన నాయకుడు. ఇంటింటికి తాగునీరు ఇవ్వకుంటే ఓట్లు అడుగనని శపథం చేసిన అపర భగీరథుడు. ప్రాజెక్టు 100 శాతం పూర్తవడంతోపాటు రాబోయే వేసవికి ముందే ప్రారంభోత్సవం చేసుకొని ప్రజల తాగునీటి కష్టాలను తీరుస్తుండటం మా జిల్లా ప్రజల అదృష్టం.
చామకూర మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ
see also : తెలంగాణలో టైమ్స్ నౌ -వీఎంఆర్ లేటెస్ట్ సర్వే ..ఎవరికి ఎన్ని సీట్లు ..?
30 ఏండ్ల సమస్య.. మూడేండ్లలో పరిష్కారం
మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో 30 ఏండ్ల నుంచి ఉన్న తాగునీటి సమస్య కేవలం మూడేండ్లలోనే పరిష్కారమైంది. 104 గ్రామాలకు సుమారు రూ.300 కోట్లతో స్వచ్ఛమైన తాగునీటిని అందించడం ప్రభుత్వ అంకితభావానికి నిదర్శనం. ఔటర్ లోపలి గ్రామాలకు సంబంధించిన పనులు కూడా 2018 డిసెంబర్ నాటికి పూర్తవుతాయి.
– మలిపెద్ది సుధీర్‌రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే
ప్రజల కల నిజమైంది
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల కల నిజమైంది. మొదట చెప్పినప్పుడు నమశక్యం కాలేదు. కానీ నేడు ఇంటింటికి గోదావరి నీరు వస్తుంటే ప్రజల కలలను కూడా నిజం చేసే సత్తా ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని తేలింది. ఇక్కడి ప్రజలు గోదావరి నదిని చూడటమే అరుదు. అలాంటిది ఇంటింటికి గోదావరి నీరు వస్తుండటం చూస్తుంటే స్థానిక ఎమ్మెల్యేగా గర్వపడుతున్నాను.
– కే వివేకానంద, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే
ఇక జిల్లా ప్రజలకు సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీరు
జిల్లాలో ప్రజలందరికీ ఇకనుంచి రక్షిత తాగునీరు ఇంటింటికి సరఫరా అవుతుంది. ఈ ప్రాజెక్టు అడ్డంకులను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ నేడు 100 శాతం పూర్తి చేయడం శుభపరిణామం.
-ఎంవీ రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్
see also : కృష్ణా టీడీపీలో సంచలనం ..టీడీపీ నుండి 5గురు ఎమ్మెల్యేలు ఔట్ ..