సేవ్ హైదరాబాద్ కార్యక్రమంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అధికారులతో ఇవాళ సమీక్ష చేపట్టారు. ఈ భేటీలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ఫారెస్ట్‌బ్లాక్‌ల అభివృద్ధిపై చర్చించారు. సమావేశం సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఔటర్‌రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఫారెస్ట్ బ్లాక్‌లను అభివృద్ధి చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కార్యచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. నగర పజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేలా ఫారెస్ట్ బ్లాక్‌లను అభివృద్ధి పరచడానికి వివిధ శాఖలు, అధికారులు సమన్వయంతో అర్బన్ లంగ్స్ స్పేస్‌లను అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణపై దృష్ణి సారించాలని చెప్పారు. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో నగర పౌరులకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడంతో పాటు టూరిజంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. నగరం చుట్టు పక్కల వెల్‌నెస్ టూరిజం, మెడిసినల్ టూరిజం, డిస్టినేషన్ టూరిజం, ఏకో టూరిజం లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
see also : ఆ పోలీసుకు మంత్రి కేటీఆర్ ఫిదా..!
మూసీ రివర్ ఫ్రంట్‌ను కేబీఆర్ పార్కులో మాదిరిగా వాక్ వే రూపొందించాలన్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా అటవీశాఖ విజయవంతంగా పనిచేస్తుంది. హైదరాబాద్ పరిసరాలలో అటవీజోన్‌ల అభివృద్ధి కోసం వివిధ శాఖల మైల్‌స్టోన్స్‌ను ఏర్పాటు చేసుకుని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి అయ్యేలా చూడాలి. నిధులకు సంబందించి వివిధ ప్రభుత్వ శాఖల నిధులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీల ద్వారా నిధులు పొందేలా చూడాలన్నారు. హైదరాబాద్ పరిసరాలలో పార్కుల అభివృద్ధిపై అటవీశాఖలో ప్రత్యేక ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని తెలిపారు. వివిధ శాఖల సమన్వయం కోసం నోడల్ అధికారిని నియమించాలన్నారు. అటవీజోన్‌ల అభివృద్ధిలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు ముఖ్య పాత్ర నిర్వహించాలని సూచించారు. పార్కుల అభివృద్ధిలో పౌరులు, వాకర్స్ అసోసియేషన్లకు భాగస్వామ్యం కల్పించాలన్నారు. నర్సరీల పెంపకంలో అటవీశాఖ సహకారం అందించాలని… ఓఆర్‌ఆర్ వెంట మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ సారించాలన్నారు. ప్రతి 10 కిలోమీటర్లలో రంగు రంగుల మొక్కలు నాటాలన్నారు. వివిధ ప్రాంతాల్లో మైనింగ్ జోన్స్, క్వారీలను గుర్తించి వాటిని పూడ్చివేసి పార్కులుగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. హెరిటేడ్ రాక్స్‌ను గుర్తించి వాటి సమీప ప్రాంతాలను టూరిజం సైట్స్‌గా అభివృద్ధి చేయాలని మంత్రి పేర్కొన్నారు.