టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవి (78) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. స్వతహాగా డ్యాన్సర్ అయిన లక్ష్మీదేవి తమ నటన శిక్షణాలయంలో ఎంతో మందికి డ్యాన్స్ లో మెళకువలను నేర్చించేవారు.. భర్త దేవదాస్ కనకాలతో కలిసి లక్ష్మీదేవి తమ నట శిక్షణాలయంలో వందల మంది నటులను తీర్చిదిద్దారు.ఇక దేవదాస్, లక్ష్మీదేవి కనకాల దంపతులకు ఇద్దరు పిల్లలు, ఒకరు రాజీవ్, మరొకరు శ్రీలక్ష్మి.
ఇక కనకాల కుటుంబానికి మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. ఈ మేరకు మా అధ్యక్షుడు శివాజీరాజా, కార్యదర్శి నరేష్‌లు ఓ ప్రకటన విడుదల చేశారు. లక్ష్మీదేవి మృతిని తట్టుకోలేకపోతున్నామని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. వెంటనే రాజీవ్ ఇంటికి రాజమౌళి, ఎన్టీఆర్ వచ్చి నివాళులర్పించారు. 11 ఏళ్ల వయసులోనే నాటక రంగంలోకి ప్రవేశించిన ఆమె నాట్యకారిణిగా, నటిగా కళామతల్లికి సేవలు అందించారు.ప్రారంభంలో మద్రాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో కళాకారులకు ఉపాధ్యాయురాలిగా ఆమె శిక్షణ ఇచ్చారు. శుభలేఖ సుధాకర్,సుహానిసి పలువురు ఆమె వద్ద శిక్షణ తీసుకున్న వారే.పలు చిత్రాల్లో కూడా ఆమె నటించారు. ప్రేమ బంధంలో జయప్రదకు తల్లిగా ఆమె నటించారు. ఆపై ఒకఊరికథ సినిమాలో అసోసియేట్ గా పనిచేస్తూనే ఒక చిన్నపాత్రలో నటించారు.పోలీస్ లాకప్ సినిమాలో విజయశాంతి అత్త పాత్రలో, కొబ్బరిబోండాం సినిమాలో రాజేంద్రప్రసాద్ తల్లి పాత్రలో నటించారు.