టీమ్ ఇండియా జూనియర్స్ దుమ్మురేపడంతో భారత్ మరోసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. ఉత్కంఠమైన ఫైనల్లో ఉత్తమమైన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో జూనియర్ కంగారూలను పరిగెత్తించి మరీ వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్నారు.న్యూజిలాండ్‌లోని ఓవల్ బే వేదికగా జరిగిన ఫైనల్లో యువ భారత్ 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. తద్వారా అత్యధికంగా నాలుగుసార్లు వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్న జట్టుగా రికార్డ్ నెలకొల్పింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిని ఆస్ట్రేలియా జట్టు 216 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జొనాథన్ మెర్లో 76 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెర్లో, పరమ్ ఉప్పల్ (34) నాలుగో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. వీరిద్దరూ రాణించడంతో ఆసీస్ ఓ దశలో మూడు వికెట్ల నష్టానికి 134 పరుగులతో పటిష్టంగా కనిపించింది. దీంతో 260 పరుగులు చేసేలా కనిపించింది. అయితే భారత బౌలర్లు ఒక్కసారిగా మ్యాజిక్ చేయడంతో… 33 పరుగులు వ్యవధిలో చివరి ఐదు వికెట్లను కూల్చడంతో ఆసీస్ 216 పరుగులకే కుప్పకూలింది.
ఇక 217 పరుగుతల విజయ లక్ష్యంతో బరిలోకి భారత్ మన్జోత్ కల్రా సెంచురీ దెబ్బకి ఆసీస్ బౌలర్లు చేతులెత్తేశారు. భారత్‌కు ఓపెనర్లు పృథ్వీ షా (29), మన్జోత్ కల్రా (101 నాటౌట్) శుభారంభం అందిస్తూ… తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన శుభ్‌మన్ గిల్ 31 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో భారత్ 131 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. అయితే మరో ఎండ్‌లో కల్రా పాతుకుపోవడంతో పాటు… హార్విక్ దేశాయ్ (47 నాటౌట్)తో కలిసి భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. భారత్ మరో 67 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. భారత బౌలర్లలో ఇషాన్ పోరెల్, శివ సింగ్, కమలేష్ నాగర్‌కోటి, అనుకుల్ రాయ్ తలో రెండు వికెట్లు తీశారు. శివమ్ మావికి ఒక వికెట్ దక్కింది. అభిషేక్ శర్మ మినహా మిగతా బౌలర్లందరికీ వికెట్ దక్కింది.