తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయ అభివృద్ధి పథకంలో భాగంగా తొలిదశ పనులను శ్రీరామ నవమిలోపు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్ ఆనంద సాయి నేతృత్వంలో రూపొందించిన మూడు నమూనాలపై చర్చించారు. చినజీయర్ స్వామి నమూనాలపై సంతృప్తి వ్యకం చేయడంతో మిగిలిన పనులపై యంత్రాంగం దృష్టిసారించింది.
దీనికితోడు ఆలయం చుట్టూ పలు నిర్మాణాలకు భూమి అవసరమని గుర్తించారు. ఈ మేరకు భూసేకరణతో అందుబాటులోకి వచ్చే 65 ఎకరాల్లో పలు ఆకృతులను నిర్మించనున్నారు. ఆలయ ప్రాకారానికి సంబంధించిన నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. . ఆర్కిటెక్ట్ ఆనందసాయితో పాటు అధికారులు పాల్గొని పరిస్థితులను మంత్రికి వివరించారు. రెండు రోజుల్లో సీఎం అనుమతి తీసుకుని నమూనాలపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందన్నారు