ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా కలిశారు. గుంటూరులోని ఒమేగా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన చంద్రబాబును ముస్తాఫా హెలిఫ్యాడ్ వద్ద కలుసుకున్నారు. చంద్రబాబుతో కొద్దిసేపు ముస్తఫా భేటీ అయ్యారు. ఇక ముస్తఫాను చంద్రబాబు వద్దకు ఎంపీ రాయపాటి సాంబశివరావు తీసుకెళ్ళడం…బాబుతో ఏకాంతంగా కొద్దసేపు ముస్తఫా మాట్లాడంతో ఎల్లో మీడియా అప్పుడే టీడీపీలోకి ముస్తఫా అంటూ ప్రచారం మొదలు పెట్టేసింది.
ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మద్దలి గిరిధరరావుపై ముస్తఫా విజయం సాధించారు. ఇక అధికార టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో ముస్తఫా చాలా చురుకుగా ఉండేవారు. ఇటీవల ఆర్టీయే అధికారుల పై టీడీపీ నేతల ప్రవర్తనను నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చెవిరెడ్డిని విడుదల చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ముస్తఫా అయితే ఏకంగా గేటు ఎక్కారు. దీంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. గేటు దిగిన తర్వాత ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీలో చురుగ్గా ఉన్న ముస్తఫా చంద్రబాబుతో సమావేశం కావడం ఇప్పడు హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ముస్తాఫా మాత్రం తాను వంద శాతం పార్టీని వీడేది లేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి తన నియోజకవర్గానికి వచ్చినందున ఆయనను మర్యాదపూర్వకంగానే కలిసేందుకు వెళ్లానంటున్నారు ముస్తాఫా. అయితే ఎల్లో మీడియా గ్యాంగ్ మాత్రం అత్యుత్సాహంతో మరో వైసీపీ ఎమ్మెల్యే జంప్ అంటూ తెగ సంకలు గుద్దుకుంటూ ప్రచారం చేస్తున్నారు.