రాష్ట్రంలో ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్ర 77 రోజులకి చేరుకుంది. విరామ లేదు.. విసుగు లేదు.. అలసట లేదు.. ఆయాసం లేదు… గట్టిగా చెప్పాలంటే జగన్‌కు విశ్రాంతి లేదు.. జగన్ వెంట నడుస్తున్న జనవాహిని తగ్గడం లేదు. సునామీలా సాగుతున్న యాత్ర, కెరటాల్లా ఎగిసిపడుతున్న ప్రజా ఉత్సాహం, జగన్‌లో జవసత్వాలను ద్విగుళం బహుళం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నాడు వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర కంటే.. నేడు జగన్ చేస్తున్న యాత్ర సమరోత్సాహంతో ఉరకలు వేస్తోంది.
ఇక జగన్ పాదయాత్రలో కేవలం సంక్షేమపథకాల ప్రస్తావన తప్ప అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రకటనలు చేయడంలేదని రాజకీయ నిపుణులు కొందరు అభిప్రాయ పడుతున్నారు. జగన్ చుట్టూ మూగుతున్నవారంతా పేదవారు.ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందక, ఉపాధి అవకాశాలు లభించక, నీళ్లు రాక, కరెంట్ లేక, వైద్య సదుపాయాలు అందక, సరైన విద్యావకాశాలు లేక అలమటిస్తూ, ప్రభుత్వం పట్ల క్రుద్ధులై, నిస్సహాయులై, ఎవరైనా కనిపిస్తే తమ మొర వినిపించుకోవాలనే ఆశలతో వచ్చేవారు తప్ప పెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు కారు.
సామాన్య జనానికి ఏమికావాలో అవే చెప్పి వారికి ఊరట కలిగించాలి తప్ప, వ్యవసాయ కూలీలు, బడుగు ప్రజలు వచ్చినపుడు వారికి ఇండియా పాకిస్తాన్ సంబంధాలు, అమరావతిలో పరిశ్రమల నిర్మాణాలు, ట్రంప్, పుతిన్ గూర్చి, ఐఐటీలు, రైల్వే జోన్స్, కేంద్ర బడ్జెట్స్, దేశ ఆర్ధిక సమస్యలను గూర్చి వారితో చర్చిస్తే ప్రయోజనం ఏముంటుంది… వారిముందు నిలబడి మీ ఊరికి విమానాశ్రయం కట్టిస్తాము, బులెట్ రైళ్లు తీసుకొస్తామని చెబితే రాళ్లు వేసి వెళ్ళిపోతారు.
సామాన్యప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో, వాటిని తీర్చగలిగి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వారిని ఇబ్బందులపాలు చేస్తే.. అలాంటి ఇక్కట్లు తీర్చే హామీలు మాత్రమే వారి మనసులకు ఉపశాంతిని కలిగిస్తాయి.అభివృద్ధి కార్యక్రమాల గూర్చి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. పేదప్రజలు, వారి సమస్యలను ఆకళింపు చేసుకుని ఓదార్చేవాడే జననేత అవుతాడు. ప్రజాసమస్యలు పట్టని వాడు ప్రజా నాయకుడు ఎలా అవుతాడు.
తాజాగా చేనేత కార్మికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, వారికోసం సంక్షేమ పధకాలను అమలు చేస్తామని, అలాగే పాదయాత్ర తరువాత బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామని అశేష వైసీపీ అభిమాన జనవాహిన సాక్షిగా ప్రకటించడంతో రాజకీనిపుణలు జగన్ కరెక్ట్ రూట్‌లో వెళుతున్నాడని అభిప్రాయపడుతున్నారు.ఇక ఇప్పటివరకు జగన్ ధృఢసంకల్పంతోనే అణువంత కూడా సడలింపు కనిపించడం లేదు. తొలిరోజు ఎలా ఉత్సాహంతో ఉన్నాడో ఇప్పుడు అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో కనిపిస్తున్న జగన్ పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించడం తధ్యమని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.