అదో చిన్న గ్రామం.. గూగుల్‌లో గాలించినా వెంటనే కనిపించదు..యూట్యూబ్‌లో వెతికినా అట్టే వినిపించదు.. మొత్తానికి వందలోపు ఇళ్లు, ఐదు వందలు దాటని జనం. ఇదీ మేడారం ముఖ చిత్రం.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరతో తన స్వరూపాన్నే మార్చేసుకుంది. హలో..హలోకే నలుదిక్కులు చూడాల్సిన చోట ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తపుంతలు తొక్కింది. మహానగరాలకు దీటుగా అరచేతిలోనే ప్రపంచాన్ని వీక్షించేలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అధునాతన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
మేడారం మహాజాతరలో ఆధునిక మొబైల్ సేవలు కొలువుదీరాయి. ఇప్పటి వరకు పట్టణాలు, నగరాలకే పరిమితమైన నాలుగోతరం(4జి) సేవలు వనంలోకి విస్తరించాయి. రెండేళ్లకు ఓసారి జరిగే జాతరకు ఎప్పుడూ భారత్ సంచారనిగమ్(బీఎస్‌ఎన్‌ఎల్) లిమిటెడ్ భక్తుల సేవలో తరిస్తుండగా ఈసారి ప్రైవేటు నెట్‌వర్క్‌లు పోటీపడ్డాయి. మేడారంలో మొదటిసారి బీఎస్‌ఎన్‌ఎల్ 2004లో సెల్‌ఫోన్ సేవలను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 2006, 2008 జాతరలోనూ ఈ సేవలే భక్తులకు ఆధారమైంది. అయితే ఉత్సవం జరిగే నాలుగు రోజులు నెట్‌వర్క్ కలవక భక్తులు నానా ఇబ్బందులు పడేవారు. 2010లో బీఎన్‌ఎన్‌ఎల్‌తో పాటు ఎయిర్‌టెల్, ఐడియా ఒడాఫోన్ సర్వీసులు మొబైల్ టవర్లను ఏర్పాటు చేసి 2జీ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. కాస్తా ఉపశమనం కలిగినా జాతర అనంతరం యథాపరిస్థితి నెలకొనేది. దీంతో మరో అడుగు ముందుకేసిన బీఎస్‌ఎన్‌ఎల్ శాశ్వత పరిష్కారానికి చొరవ చూపింది. ఏడాది క్రితం ప్రత్యేకంగా టవర్‌ను ఏర్పాటు చేసింది. భక్తులకు నిత్యం 3జీ సేవలను అందిస్తోంది. అమ్మల చెంతకు వస్తే బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ విధిగా ఉండాలనే సంకేతాలను భక్తులకు చేరవేసింది.
‘స్మార్ట్’గా సేవలు
జాతరలో సేవలను విస్తృతంగా అందించేందుకు నెట్‌వర్క్ సంస్థలు పోటీపడుతున్నాయి. ప్రభుత్వ నెట్‌వర్క్‌కు దీటుగా ప్రైవేటు కంపెనీలూ ముందుకొచ్చాయి. మెరుగైన సేవలు ఉండటంతో ఈసారి ప్రభుత్వ యంత్రాంగం మేడారం జాతర కాంటెస్ట్-2018 పేరిట భక్తులకు ఫొటోగ్రఫీ, సెల్ఫీ, లఘుచిత్రాల పోటీ పెట్టింది. సెల్‌ఫోన్‌లో దిగి మేడారం వెబ్‌సైట్‌కు పంపితే చాలు ఉత్తమ బహుమతిగా రూ. 2.70 లక్షల వరకు నగదు బహుమతి అందజేసేలా భక్తజనాన్ని ప్రోత్సహించింది.
బీఎస్‌ఎన్‌ఎల్ 32 చోట్ల మెబైల్ టవర్లను బిగించి 3జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. బుధవారం నుంచి శనివారం రోజూ 3లక్షల మందికి ఉచిత వైఫై సేవలను అందించే ఏర్పాట్లు చేసింది. తామేమీ తక్కువ కాదన్నట్లుగా ప్రైవేటు సంస్థలు పదుల సంఖ్యలోనే మొబైల్ వ్యాన్లపై టవర్లను అమర్చింది. జియో సర్వీసు సైతం ఆరంగ్రేటం చేసింది. బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థతో కలిసి రూ. 49కే ఉచిత అపరిమిత కాలింగ్, 4జీ అంతర్జాలం సేవలను అందిస్తోంది.