అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లోకి యువభారత్ అడుగుపెట్టింది. న్యూజిలాండ్‌లోని క్రెస్ట్ చర్చ్ వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత కుర్రోళ్ళు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేశారు. భారత యువ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ కుర్రోళ్లు పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టారు. పాక్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ ఏకంగా 203 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 273 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ భారత బౌలర్ల ధాటికి కేవలం 69 పరుగులకే కుప్పకూలింది. ఫిబ్రవరి 3న జరిగే ఫైనల్లో భారత్.. ఆస్ట్రేలియాతో తలపడనుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు పృథ్వీ షా(41), మన్ జోత్ కల్రా47) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. అనంతరం స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ పెవిలియన్‌కు చేరడంతో శుభ్‌మన్ గిల్ రంగంలోకి దిగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా తాను మాత్రం ఆచితూచి పరుగులు రాబడుతూ శతకం(102) సాధించాడు. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. 273 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ తొలి నుంచి పరాజయం దిశగా సాగింది. భారత బౌలర్లు పోరెల్(4వికెట్లు), శివసింగ్(2), పరాగ్(2) విజృంభణతో 29.3 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలింది. పాక్ జట్టులో 18 పరుగులతో రొహాలీ నజీర్ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.