వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో కల్లోలం సృష్టిస్తోంది. జగన్ ఒక వైపు పాదయాత్రను ఉదృతం చేస్తూనే మరోవైపు పార్టీని బలోపేతం చేసే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే బలమైన నేతలను వైసీపీ వైపు తిప్పుకునేందుకు తనదైన వ్యూహాలు రచించుకుంటున్నారు. ఇక తాజా హాట్ టాపిక్ ఏంటంటే.. గతంలో కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ప్రకాశం, నెల్లూరు, గూడురు జిల్లాల్లో చక్రం తిప్పిన మాజీ బాపట్ల ఎంపీ పనబాక లక్ష్మీ ఆమె భర్త పనబాక కృష్ణయ్యకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అసలు మ్యాటర్ లోకి వెళితే.. 1996, 1998, 2004లో నెల్లూరు నుంచి గెలుపొందిన లక్ష్మీ, 2009 బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కేంద్రంలో జౌళి శాఖ సహాయ మంత్రిగా కూడా ఆమె పనిచేశారు. ఇక, అదే ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో గూడురు నుంచి పనబాక కృష్ణయ్య అసెంబ్లీకి పోటీ చేశారు. అయితే ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి లేకపోవడంతో 2019లో తమ రాజకీయ భవిష్యత్తు కార్యచరణకోసం పనబాకలక్ష్మీ దంపతులు కొత్త అడుగులు వేసే దిశగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో పనబాక లక్ష్మీ, పనబాక కృష్ణయ్యలు వైసీపీ లో చేరేతే భవిష్యత్తు బాగుంటుందని ఆమె అనుచరులు సలహా ఇచ్చారట. దీంతో జగన్ పార్టీ నుండి కూడా పిలుపు వచ్చిందని.. పనబాక దంపతులు కూడా పాజిటీవ్‌గా రెస్పాండ్ అయ్యారని.. దీంతో జగన్ పాదయాత్రలో ఉండగానే పనబాక దంపతులు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని ఓ వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఒకవైపు బాపట్లలో సరైన అభ్యర్ధి కోసం చూస్తున్న జగన్.. వచ్చే ఎన్నికల్లో పనబాక లక్ష్మీని ఇక్కడి నుంచి పోటీ చేయించడం ద్వారా ఆమె సొంత ఇమేజ్‌తోపాటు.. వైసీపీ ఇమేజ్ కూడా కలిసివచ్చి గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.