భార్యా భర్తలు ఇద్దరూ ఒక హోటల్లో కూర్చొని టిఫిన్ తింటున్నారు. ఈ సందర్భంలోనే భార్య భర్తను ఇలా అడగ సాగింది. ఈ మధ్య మీలో చాలా మార్పు వచ్చింది. మమ్మల్ని తరచూగా బయటకు తీసుకొస్తూ.. మాతో హాయిగా గడుపుతున్నారు. నిజం చెప్పండి మీ మొహంలో తేడా కనిపిస్తోంది. అంటూ అడిగిన భార్య ప్రశ్నలకు భర్త తటపటాయిస్తూ చివరకు సరేననితన డైరీలోని ఒక లెటర్‌ను బయటకు తీసి భార్య చేతిలో పెట్టాడు భర్త. వణుకుతున్న చేతులతో ఆ లెటర్‌ను తీసుకుని చదవసాగాంది భార్య.
ఆ ఉత్తరం.. తన అత్తగారు కొడుకుకు రాసిన ఉత్తరం. కన్నీళ్లు నిండిన కళ్లతో చదవ సాగింది.
ప్రియమైన కుమారుడికి.. ఎప్పుడో ఒక రోజు ఈ ఉత్తరం నీ చేతికి ఈ ఉత్తరం దొరుకుతుందని ఆశతో రాస్తున్నాను. కాస్త ఓపిగ్గా, పూర్తిగా ఈ ఉత్తరాన్ని చదువు చిన్నా, ఈ తల్లి మనసును అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. మీ నాన్నను పెళ్లి చేసుకోక ముందు నేనొక లెక్చరర్‌ని, పెళ్లి చేసుకున్న తరువాత నీవు పుట్టావు. మీ నాన్నకు అదృష్టం కలిసొచ్చింది.. బాగా సంపాదించసాగాడు. నీకు చెల్లి పుట్టాక నేను ఉద్యోగం చేయడం మానేశాను. మీ నాన్న చాలా బిజీ అయ్యారు. వివాహం అయిన అనంతరం సంవత్సరంలో ఎలాంటి బాధ లేకుండా ఉంది. ఆ తరువాత అన్నీ ఎదురు చూపులే. మీ నాన్న కోసం ఎదురు చూపులు. ఆదాయం మీద మోజుతో మీ నాన్న సమయానికి ఇంటికి వచ్చే వారు కాదు. మీరే నాకు దిక్కు. మీతోనే నా సంతోషం. ఉదయం లేవగానే మీరు తయారై స్కూలుకు వెళతారు. మీ రాకకోసం ఎదురు చూపు.
ఇలా మీరు పెద్దవారై పోయారు. నాతో మాట్లాడేందుకు కూడా మీకు సమయం ఉండేది కాదు. అవసరానికో మాట. ఉద్యోగాలు వచ్చేశాయి. మీకు. మీ హడావుడి మీద. పిల్లలైనా నాతో మాట్లాడుతారేమోనని ఎదురు చూపు. మీరు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే వరకు ఎదురు చూపు.. ఇంటికి వచ్చి రాగానే భోజనం చేసి పడుకుంటారు. వంట బాగుందని కానీ.. బాగాలేదని కానీ చెప్పడానికి కూడా మీకు సమయం ఉండదు. మీ నాన్న వ్యాపారాన్ని మీకు అప్పచెప్పారు. నీవు కూడా బిజీ అయిపోయావు. మీ చెల్లెలకు పెళ్లి చేశావు. భర్త విదేశాల్లో ఉండటంతో ఆమె కూడా విదేశాలకు వెళ్లిపోయింది. ఆమె సంసారం, ఆమె జీవితం. వారానికి ఒకసారి రెండు నిమిషాలు మాత్రమే ఫోన్‌లో మాట్లాడేది. ఆమె ఫోన్ కోసం ఎదురు చూపు. మీ నాన్నకు ఆరోగ్యంపాడై ఇంట్లో ఉంటే ఆయనకు సమయానికి మందులు అందించేందుకు ఎదురు చూస్తూ గడిపేదాన్ని. చూశావా నా బ్రతుకంతా ఎదురుచూపులోనే ముగిసిపోయింది.
ఇప్పడు నీకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. నీకు ఓ విషయం బతికి ఉన్నప్పుడు చెప్పలేక పోయాను. చినిపోయే ముందు ఈ ఉత్తరం రాస్తున్నాను. మీ నాన్నగారు ఆరోగ్యం బాగాలేక మాత్రలు ఇస్తావా.. అన్నం పెడతావా..? అంతే.. పేపర్ చదివేందుకు సమయం ఉంటుంది. నాతో మాట్లాడేందుకు సమయం ఉండేది కాదు మీ నాన్నకు. మీ సంగతి సరే సరి. వయసులో సంపాదన మోజులోపడి నాతో మాట్లాడేందుకు కూడా సమయం ఉండదు మీకు. ఇక ఈ వయసులో మాట్లాడేందుకు ఏముంటుంది.. ఎదురు చూపు.. ఎదురు చూపు.. ఎదురు చూపు.. ఇప్పుడు చావు కోసం నా ఎదురు చూపు. నాలా నీ కూతురో.. కొడుకో ఉత్తరం రాయకూడదనే ఉద్దేశంతో ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇంట్లో ఉండే వారి ఆడవారికి కూడా మనసు ఉంటుందని, మన కోసమే బతుకుతుందని గ్రహించు. నేను ఎదురు చూసినట్టు నీ భార్య ను కూడా ఎదురు చూసేలా చేయకు. మనసు విప్పి అన్నింటిని ఆమెతో షేర్ చేసుకో.. నీ భార్యతో నీ పిల్లలతో కొద్ది సేపైనా గడుపు. ధనార్జనతో వారిని నిర్లక్ష్యం చేయకు. కోడలు. మనవడు. మనవరాలు జాగ్రత్త. నా కొడలుకు నాలాంటి పరిస్థితి రాకుండా చూసుకో.. తనకూ నాలాంటి మనసే ఉంటుందని గుర్తించు. అందులో నేనే ఉంటానని గమనించు. తను కూడా నాలా ఎదురు చూపులకు బలి కానివ్వొద్దు. మీ కుటుంబంతో హాయిగా గడుపు. వారి మనస్సును బ్రతికి ఉన్నప్పుడే గెలుచుకో. నీ సంసారమే నీకు అన్నింట్లో తోడుంటుందని మరవొద్దు. అంటూ ఆ తల్లి రాసిన ఉత్తరంలో పేర్కొంది.