వైసీపీ అధినేత జగన్ పెంపకం పై అసెంబ్లీలో.. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యాల పై వైఎస్ విజయమ్మ స్పందించారు. ఇలాంటి విషయాల్లో స్పందించడం, విమర్శించడం అవసరం లేదని.. జగన్ ఎలాంటివాడో స్వయంగా రాష్ట్ర ప్రజలే చూస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్‌ని చిన్నతనం నుండే విలువలతో పెంచామని.. చిన్నప్పుడు నుండే జగన్ క్రమ శిక్షణతో ఉండేవాడని.. తనకు ఒక్క దురలవాటు కూడా లేదని… సిగరెట్ కూడా ముట్టడని.. పబ్‌లకు వెళ్లే అలవాటు లేదని చెప్పారు. పనిచేసుకుపోవడం, చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచేందుకు ప్రయ్నతించడం మాత్రమే జగన్‌కు తెలుసన్నారు విజయమ్మ.
ఇక రోశయ్యను ముఖ్యమంత్రిని చేద్దామంటే జగన్ వెంటనే అంగీకరించారని.. అయితే రఘువీరారెడ్డి లాంటి కాంగ్రెస్ నేతలు వచ్చి ఒప్పుకోవద్దని జగన్‌కు సూచించారన్నారు. అంతే కాకుండా జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని ఏనాడు అనుకోలేదని.. అయితే పొమ్మనకుండా పొగపెట్టి జగన్‌ను బయటకు పంపించివేశారని ఆమె చెప్పారు. అంతే కాకుండా జగన్ ఎమ్మెల్యేల చేత సంతకాలు చేయించారంటూ సోనియాగాంధీకి తప్పుడు నివేదికలు పంపారని.. ఆ విషయాన్ని సోనియా చాలా సీరియస్‌గా తీసుకున్నారని వివరించారు. ఆ తర్వాత జగన్ పై ఎలాంటి కుట్రలు చేశారో ప్రజలంతా చూసారని.. జగన్‌ని విమర్శించినా, బెదిరించినా, జైల్లో పెట్టినా.. ఒక్కడే మొండిగా నిలబడ్డాడని, ప్రజలే జగన్ వెంట నిలబడ్డారని విజయమ్మ అన్నారు.