సౌజన్యం : ఇలపావులూరి మురళీమోహన్ రావు గారు
నాలుగేళ్లక్రితం కేసీయార్ కు , నేటి కేసీయార్ కు తేడా ఎవరైనా గమనించారా? అధికారం చేబూనిన తొలిరోజుల్లో ప్రతిపక్షనాయకుల విమర్శలకు కొంచెం ఘాటుగా జవాబిచ్చేవారు ఆయన. గత కొద్దీ మాసాలుగా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, వ్యక్తిగత దూషణలు చేసినా, కేసీయార్ అసలు సమాధానము ఇవ్వడం లేదు సరికదా… తన పార్టీవారిని కూడా ఇతర పార్టీల నాయకులను దూషించవద్దు, దుర్విమర్శలు చెయ్యవద్దు అని గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా, తెరాస అగ్రనాయకులు ఎవరూ స్పందించడం లేదు. ముఖ్యంగా, కేసీయార్, కెటియార్, హరీష్ రావు, ఈటల, నాయని లాంటి నేతలు ప్రతిపక్ష నాయకుల విమర్శలను పెద్దగా పట్టించుకోవడం లేదు.
మనం మంచిపనులు చేసినంతకాలం, ప్రజలకు మనం మేలు చేసినంతకాలం, మనం చిత్తశుద్ధితో, నిజాయితీగా పాలించినంతకాలం ప్రజలే మనకు అండగా నిలబడతారని కేసీయార్ విశ్వాసంతో ఉన్నారు. గత నాలుగేళ్లలో వివిధ రంగాలలో కేసీయార్ ప్రభుత్వం సాధించిన విజయాలు సామాన్యమైనవి కావు. ముఖ్యంగా నీటి ప్రాజెక్టుల విషయంలో కేసీయార్ ప్రభుత్వం గణనీయమైన విజయాలను సాధిస్తున్నది. అవినీతి చాలావరకు తగ్గింది. రాజకీయ అవినీతి బాగా నియంత్రించబడ్డది. ముఖ్యంగా మధ్యతరగతివారిని సంతృప్తి పరచే కరెంట్, నీటి సమస్యలను కేసీయార్ అద్భుతంగా అధిగమించారు. రవాణా చార్జీలను పెంచలేదు. సంక్షేమపధకాలను నిరాటంకంగా అమలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాబోయే జూన్ నాటికి ఫలితాలను ఇవ్వబోతున్నది. కాళేశ్వరం నీరు వచ్చాక మూడు వంతులు తెలంగాణ పచ్చదనాన్ని పరచుకోబోతున్నది.
మొన్న మేము సింగపూర్ వెళ్ళినపుడు కొందరు ఎన్నారైలు (ఆంధ్రా వారు) మమ్మల్ని కలిశారు. వారంతా కేసీయార్ పాలన పట్ల హర్షామోదాలు వ్యక్తం చేస్తూ ఆంధ్రాలో కూడా అలాంటి నాయకులు…ముఖ్యంగా కేసీయార్, కెటియార్, హరీష్ రావు లాంటి వారు అవసరం అని అభిప్రాయపడ్డారు. ఆంధ్రావారినిని కూడా అభిమానులను చేసుకున్నారంటే కేసీయార్ పాలన ఎంత సంతృప్తస్థాయిలో జరుగుతున్నదో అర్ధం అవుతుంది.
ఇక్కడ ప్రతిపక్షాలను నేను తప్పు పట్టను. రాబోయే ఎన్నికల్లో వారికి ప్రజామోదం లభించి 119 సీట్లు గెలుచుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, తెలంగాణాలో ఇప్పటివరకు లేని కులాల కుంపట్లను రగిలించి తెలంగాణను మరో ఆంధ్రప్రదేశ్ లా తయారు చెయ్యవద్దు. అధికారపక్షం పై కువిమర్శలు వద్దు. పక్కన ఆంధ్రప్రదేశ్ వారు కూడా కేసీయార్ పాలనను మెచ్చుకుంటున్నారు అన్న స్పృహతో ఉండండి. విధానాలపై పోరాడండి. సమస్యలపై పోరాడండి. అంతే తప్ప పసలేని విమర్శలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడవద్దు.