ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై రెండు రోజులుగా అలుపు ఎరగకుండా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో శుక్రవారం జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఏపీ ప్రజలకు ఒక సందేశాన్నిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.ఆ వీడియోలో జగన్ మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మొహం చూసో లేక తన మొహం చూసో రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు ఎవరూ రారని ఆయన అన్నారు. పరిశ్రమలు, హోటల్స్, ఆసుపత్రులు, విద్యాసంస్థలు.. ఇలా ఏవైనా సరే నెలకొల్పేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయా? లేదా? అని మాత్రమే చూస్తారని చెప్పారు. మన రాష్ట్రంలో అలాంటి అనుకూల పరిస్థితులు లేవని చెప్పారు. మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేముందు.ఇతర ప్రాంతాలలో ఉన్న అనువైన పరిస్థితులతో బేరీజు వేసుకుంటారని తెలిపారు. సహజంగానే ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన ఆ ప్రాంతాలకే ఇన్వెస్టర్లు వెళ్లిపోతారని చెప్పారు.పెట్టుబడి దారులు మన వద్దకు రావాలంటే… ప్రత్యేక హోదా ఉంటేనే అది సాధ్యమని జగన్ తెలిపారు. పదేళ్లపాటు ఆదాయపు పన్ను, జీఎస్టీలో మినహాయింపులు ఉంటేనే పెట్టుబడిదారులు మన వద్దకు వస్తారని చెప్పారు.
