తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ భర్త ,కాంగ్రెస్ నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ ను హత్య చేసింది కాంగ్రెస్ నాయకులేనని ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ స్పష్టం చేశారు.ఇవాళ అయన టీఆర్‌ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ..శ్రీనివాస్ హత్యకు కారకులైన వారికి కఠినంగా శిక్ష పడాలన్నారు.ఈ హత్యపై న్యాయ విచారణ జరగాలన్నారు.ప్రధాన నిందితులైన మల్లేష్,రాంబాబు,శరత్ కాంగ్రెస్ కార్యకర్తలేనని ఈ సందర్బంగా నల్లగొండ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తో కాలిసి దిగిన ఒక ఫోటోను మీడియా ముందు చూపించారు.
రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా దాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలపై రుద్దడం సరికాదన్నారు.కాంగ్రెస్ నీచ ,దివాళాకోరు రాజకీయాల కు పాల్పడి తమ నీచబుద్ధిని బయటపెట్టుకుంటున్నారని మండిపడ్డారు. శ్రీనివాస్ గత సంవత్సర కాలంగా ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారో లిస్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే వీరేశం ఫోన్ కాల్స్ లిస్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ కాల్స్ లిస్ట్ కూడా బయట పెట్టాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే వీరేశంతో శ్రీనివాస్ ను హత్య చేసిన నిందితులు దిగిన ఫోటో ఆయన పీజీ పరీక్ష రాసేందుకు వచ్చినపుడు కాలేజ్ వద్ద జరిగిందని ఈ సందర్బంగా తెలిపారు.నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏవిచారణ సంస్థ తో విచారణ జరిపినా మాకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. హత్యా రాజకీయాలు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ నేతలకు అలవాటేనన్నారు.