మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో సాంస్కృతికోత్సవాలను ఘ నంగా నిర్వహించనున్నారు. ఈ నెల 31, వచ్చేనెల 1, 2 తేదీల్లో మూడురోజులపాటు జరిగే జాతరలో 31 జిల్లాల జానపద, గిరిజన కళారూపాలను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు వందలమంది కళాకారులు సిద్ధమవుతున్నారు. దీంతోపాటు రాష్ట్ర సాం స్కృతిక సారథి కళాకారులు తెలంగాణ ఆటపాట నిర్వహించనున్నారు. ఇందుకోసం పర్యాటకశాఖ ప్రత్యేక వేదికను సిద్ధం చేసినట్టు ఆ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు.
గిరిజన సంక్షేమశాఖ, భాషా సాంస్కృతికశాఖల గుర్తింపు పొందిన కళాకారులు వేడుకల్లో పాల్గొంటారు. లంబాడ నృత్యాలను ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా పది బృందాలకు శిక్షణ ఇచ్చారు. గుస్సాడీ, కోయ, మాధురి, కొమ్ము నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటుచేస్తున్నారు. జాతరలో ప్రదర్శించే జానపద, గిరిజన నృత్యాలపై డాక్యుమెంటరీ చేస్తామని భాషా సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పేర్కొన్నారు. భజనలు, కోలాటాలు, జడకొప్పులు, డప్పుల దరువు లు, ఒగ్గుడోలు విన్యాసాలతోపాటు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన బుడబుడుకలు, గంగిరెద్దులు, కాటికాపర్లు, సాధనాశూరులు వంటి జానపద కళారూపాలన్నింటినీ ఈ మూడురోజులపాటు ప్రదర్శించనున్నారు. 29 నుంచి వరంగల్ నగరంలోని నేరెళ్ల వేణుమాధవ్ కళామండపంలో సురభి కళాకారులు సమ్మక్క-సారలమ్క పద్యనాటకాన్ని ప్రదర్శించనున్నారు.