ప్రపంచ వ్యాప్తంగా పద్మావత్’ చిత్రం విడుదలైనందుకు కర్ణి సేనలు విధ్వంసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీని గురించి వివిధ న్యూస్ ఛానళ్లు వారితో చర్చలు కూడా నిర్వహించాయి. అలాగే ‘న్యూస్ ఎక్స్’ ఛానల్ కూడా కర్ణి సేన మద్దతుదారు సూరజ్‌పుల్ అముతో లైవ్ చర్చ నిర్వహించింది. గతంలో దీపికా పదుకునే ముక్కు కోయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సూరజ్.. ఈ లైవ్ డిబేట్‌లో నోరు జారి మరోసారి అభాసు పాలయ్యారు.
లైవ్‌లో ఆయనతో మాట్లాడుతున్న న్యూస్ యాంకర్ సంజన చౌహాన్‌ను ఆయన మూడు సార్లు ‘బేబీ బేబీ’ అంటూ సంబోధించారు. దీంతో ఒక్కసారిగా ఇబ్బందికి గురైన సంజనా, సూరజ్ మీద విరుచుకుపడింది. ఒక మహిళతో ఎలా మాట్లాడాలో తెలియని కర్ణి సేనలు ఓ కల్పిత పాత్ర గౌరవం కోసం దేశ ప్రజలను ఇబ్బంది పెడుతుండటం హాస్యాస్పదంగా ఉందంటూ, గౌరవం కాపాడటంలో ఇదెక్కడి సూత్రమని ఆమె ప్రశ్నించింది. దీనికి సమాధానం చెప్పడానికి తడబడిన సూరజ్, ఆమెను ‘నోర్మూయ్’ అంటూ లైవ్ నుంచి వెళ్లిపోయాడు.