దావోస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రశంసలు దక్కాయి. ఈ రోజు దావోస్‌లో ఇన్వెస్ట్ ఇండియా అధ్వర్యంలో జరిగిన Developing RD in India అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. దేశంలో పరిశోధన రంగానికి మరింత ప్రాధాన్యత పెరగాల్సిన అవకాశం ఉందని ఇందుకోసం దేశంలోని పరిశోధన సంస్ధలు, ఉన్నత విద్యా సంస్దలు మరింత చొరవ తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రైవేటు రంగంలో పెద్ద సంస్ధలు చేస్తున్న పరిశోధనలతో దేశంలోని అకాడమిక్ రీసెర్చీని సమ్మిళితం చేసినప్పుడు మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. పరిశోధనా కార్యక్రమాలతోపాటు పరిశోధనంతర ఫలితాల అధారంగా ప్రభుత్వ ప్రొత్సాహకాలుండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సిలికాన్ వ్యాలీలో గొప్ప విజయాలకు కారణం అక్కడి పరిశోధన సంస్ధలే కారణమని మంత్రి కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్లో 50 పరిశోధన సంస్ధలును అనుసంధానం చేస్తూ రిసెర్చ్ ఎండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH) ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ వివరించారు. రీసెర్చ్ ఫలితాలు మార్కెట్లోకి రావడానికి రిచ్ సంస్థ కృషి చేస్తుంది అని తెలిపారు. ఇస్రో లాంటి భారతీయ సంస్ధలు తమ పరిశోధన పటిమను, సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటాయని. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని ఇస్రో విజయం నిరూపిస్తుంది అని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్దకంపెనీల నుంచి కాకుండా స్టార్టప్స్ నుంచే వస్తాయని అందుకే తెలంగాణ ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.
రిసెర్చ్ ఎండ్ డెవలప్మెంట్ రంగంలో ఆసక్తి గల కంపెనీలకు తెలంగాణ ఆహ్వానం పలుకుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీ హబ్, టీ-వర్క్స్, రిచ్ లతో భాగస్వాములు అయ్యేందుకు ముందుకు రావాలన్నారు. తాము త్వరలోనే పరిశోధన చేయనున్న టి-వర్క్స్ ద్వారా హార్డ్ వేర్ రంగంలోనూ పరిశోధనలకు అవకాశం కలుగుతుందన్నారు. విద్యార్దుల్లో పరిశోధన పట్ల ఆసక్తి నెలకోల్పేలా చూసేందుకు శాస్త్రీయ పరిశోధనల పట్ల వారిలో ఒక దృక్పథాన్ని పెంచే ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయాలన్నారు. పరిశోధనల ద్వారానే అభివృద్ది చెందుతున్న దేశాలు ఎదుర్కోంటున్న పలు సమస్యలకు వేగవంతమైన పరిష్కార మార్గాలు లభిస్తాయన్న మంత్రి, పరిశోధన ఫలితాలు, పేటెంట్లు, మేథో సంపత్తిని కాపాడేందుకు తెలంగాణ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్ యూనిట్ ( TIPCU) ను ఏర్పాటు చేశామన్నారు.