వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతున్న దావోస్‌లో తెలంగాణకు ప్రత్యేక గౌరవం దక్కింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఈ విశిష్ట గౌరవం దక్కింది. దావోస్ లోని వరల్ఢ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో భాగంగా ఈ రోజు పలు దేశాల ఉప ప్రధానులు, మంత్రులు పాల్గొన్న “Leveraging Digital to Deliver Value to Society` అనే సెషన్లో మంత్రి ప్రసంగించారు. ఈ సమావేశంలోని ప్యానెలిస్టులంతా అయా దేశాల కేంద్ర ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించగా, మంత్రి కేటీఆర్ ఒక్కరికే ఒక రాష్ట్ర మంత్రిగా ఇందులో పాల్గొనే అవకాశం దక్కడం గమనార్హం.
మంత్రి కేటీఆర్ తన ప్రసంగంలో తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టిన డిజిటల్ తెలంగాణ కార్యక్రమం గురించి వివరించారు. ఇందులో భాగంగా మిషన్ భగీరథతో పాటు ప్రతి ఇంటికీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ సౌకర్యం ఫైబర్-గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా కల్పిస్తున్నామని, ప్రభుత్వ సేవలన్నీ డిజిటల్ మాధ్యమాల ద్వారా అందజేస్తున్నామని, అట్లాగే డిజిటల్ అక్షరాస్యతా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. బెల్జియం, బ్రెజిల్, డెన్మార్క్, పోర్చుగల్, మయన్మార్, ఇండోనేషియా, నైజీరియా, లెబనాన్, బంగ్లాదేశ్, ఖతార్, పాకిస్తాన్ దేశాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.