రూ.15 వేల కోట్ల నిధులతో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిని గుజరాత్ కంటే మిన్నగా చేసేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు .రాష్ట్రంలోని రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు చర్యలు చేపట్టామని..ఇందుకు కేంద్రప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించిందని అన్నారు. అయన మీడియాతో మాట్లాడుతూ… 135ఎల్ జాతీయ రహదారికి రంగసాయిపేట, కే సముద్రం, నెక్కొండ, మహబూబాబాద్‌లను అనుసంధానిస్తామన్నారు. అలాగే జయశంకర్ జిల్లా ఆంశాన్‌పల్లి నుంచి వరంగల్ జిల్లా గొర్లవేడు, గరిమిలపల్లి, నేరేడుపల్లి తండా మీదుగా జమ్మికుంట, కరీంనగర్ వరకు 131 కిలోమీటర్ల జాతీయ రహదారిని అభివృద్ధి చేస్తామన్నారు.తుపాకులగూడెం, దుమ్ముగూడెం సీతారామ ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఇరిగేషన్ ప్రాజెక్టులను విద్యుత్ కేంద్రాలతో అనుసంధానిస్తూ గోదావరి నది వెంట జాతీయ రహదారులను నిర్మించాలన్న ప్రతిపాదనకు మంజూరు లభించిందన్నారు.
