పవన్ కల్యాణ్ తెలంగాణలో రాజకీయ యాత్ర పై టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన అచ్చెన్న.. ఏపీలో మరో పార్టీ అవసరమే లేదని అన్నారు. ఇక జగన్ చేస్తున్న పాదయాత్రను ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని.. టీడీపీ నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమాల అనంతరం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పుకొచ్చారు.
ప్రత్యేక హోదాను కల్పిస్తే భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించడానికి సిద్ధమన్న జగన్ వ్యాఖ్యలను అచ్చెన్న తప్పు పట్టారు. ఏపీ భవిష్యత్తులో మరే పార్టీలూ ఉండవని, కేవలం టీడీపీ మాత్రమే ఉంటుందని.. అసలు రాష్ట్రానికి మరో రాజకీయ పార్టీతో అవసరం లేదని అచ్చెన్న కుండ బద్దలు కొట్టారు. తమ ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఉనికే ప్రశ్నార్థకం అవుతోందని అచ్చెన్న అనడం రొటీనే అని అనుకున్నా.. ఏపీలో మరో రాజకీయ పార్టీ అవసరమే లేదని మంత్రిగారు అనడం మాత్రం.. పరోక్షంగా పవన్ కల్యాణ్ పై కూడా చురక వేసినట్టే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.