కేసీఆర్ ఆదర్శ గ్రామమైన చిన్నకోడూర్ మండలం రామునిపట్ల గ్రామ వాగు రానున్న రోజుల్లో యేడాదికి 100 రోజులకు పైగా మత్తడి దూకుతుందని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని రామునిపట్ల గ్రామంలో మంగళవారం బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో 40వరకూ పొలం కుంటల తవ్వకాల కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపకురాలుబాలక్కతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. వర్షపు నీటిని కాపాడి భూ గర్భ జలాలు పెంపు లక్ష్యంగా బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో పొలం కుంటల కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి తెలిపారు.
సేంద్రీయ వ్యయసాయాన్ని ప్రొత్సహించడమే ధ్యేయంగా బాల వికాస ఆధ్వర్యంలో చేపట్టిన పొలం కుంటల కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని మంత్రి అన్నారు. పొలం కుంటల కార్యక్రమాన్ని సిద్ధిపేట నియోజకవర్గం పరిధిలో ఒక ఉద్యమంలా చేపట్టి.. రాష్ట్రానికే ఆదర్శంగా అవుదామని మంత్రి పిలుపునిచ్చారు. ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని తిమ్మాయిపల్లి, ఇబ్రహీంపూర్, ఇప్పుడు రామునిపట్లలో 40 పొలం కుంటల తవ్వకాలు చేపట్టినట్లు, అలాగే త్వరలోనే గుర్రాల గొంది గ్రామంలో 40 పొలం కుంటలను ప్రారంభించనున్నామని పేర్కొన్నారు.
నియోజకవర్గం పరిధిలో 27 చెక్ డ్యామ్ లు ఉన్నాయని, చిన్నకోడూర్ మండలంలోని రామునిపట్ల గ్రామంలోని వాగు రాబోయే రోజులలో యేడాదికి 100 రోజులకు పైగా మత్తడి పారుతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయక సాగర్ ప్రాజెక్టు కింద ఎడమ, కుడి కాలువ ద్వారా 775 ఎకరాలకు సాగునీరు అందనున్నదని రైతులకు వివరించారు.సేంద్రీయ ఎరువులు పంటలు పండించే రైతులకు సిద్ధిపేట రైతు బజారులో స్టాల్ పెట్టిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ విషయమై బాల వికాస సంస్థ వ్యవస్థాపకురాలు బాలక్క రామునిపట్ల గ్రామానికి రావడం మన అదృష్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, ఇతరులు పాల్గొన్నారు.