వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్పం పాదయాత్ర ఈ నెల 28వ తేదీన నెల్లూరులో 1,000 కిలో మీటర్ల మైలురాయిని అధిగమిస్తున్న సందర్భంగా ‘వాక్ విత్ జగనన్న’ (జగనన్నతో నడుద్దాం) అనే కార్యక్రమం చేపట్టాలని వైసీపీ పార్టీ పిలుపు నిచ్చింది. గత ఎడాది నవంబర్ 6 నుండి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 13 జిల్లాల్లో 3,000 కిలోమీటర్లు చేస్తున్న వైఎస్ జగన్ పాదయాత్ర అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపేందుకు ‘జగనన్నతో నడుద్దాం’ అనే కార్యక్రమాన్ని పార్టీ రూపొందించింది. దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలు 700కు పైగా ప్రదేశాల్లో ఏక కాలంలో వైఎస్ జగన్‌కు సంఘీభావం తెలుపుతూ ఆరోజున పాదయాత్రను చేపట్టనున్నారు. అంతేగాక మరోపక్క పదిహేను దేశాల్లోని సుమారు 25 నగరాల్లో కూడా జగన్‌కు సంఘీభావంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నారై విభాగం సభ్యులు పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాలు, ఎన్నారై విభాగం సభ్యులు ఈ యాత్ర సమన్వయ బాధ్యతలు చేపడతారు.
