ఏపీ లోని నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి అరెస్ట్ సంచలనం సృష్టించింది. జిల్లాలో చాలామంది పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లో ఉన్నారు . మాగుంట, ఆదాల, బీద మస్తాన్ రావు, కురుగొండ్ల, కాకాణి గోవర్ధన్ రెడ్డి, మేకపాటి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కన్నబాబు ఇలా అనేకమంది రాజకీయాల్లో ఉన్నా ఇటువంటి కేసులు ఎదుర్కొన్న వారిలో వాకాటి నారాయణ రెడ్డి ఒక్కరే. బొల్లినేని రామారావు మీద కూడా మహారాష్ట్రలో ఇరిగేషన్ కాంట్రాక్ట్ పనుల గురించి కేసులు ధాఖలైవున్నా అవి అరెస్టులవరకు దారితీయలేదు. వాకాటి నారాయణ రెడ్డిని ఒక్కరినే రుణాల కుంభకోణంలో సీబీఐ అరెస్ట్ చేసింది.
ఈ కేసు రుణాల ఎగవేతకు సంబంధించింది కాదు. నారాయణ రెడ్డి సొంత కంపెనీలు పేరుతో తీసుకున్న లోన్లు, ఆ లోన్లకు పూచీగా పెట్టిన ఆస్తులు, ఈ రెండిటి మధ్య వ్యత్యాసమే ఈ కేసుకు మూల కారణం. నారాయణ రెడ్డి తన VNR INFRA పేరుతో వివిధ బ్యాంకులనుంచి 205 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు. వీటికి పూచీగా ఆస్తులను తాకట్టుపెట్టారు. 60 కోట్ల రూపాయలు కూడా విలువచేయని ఆస్తులను విలువ పెంచి 205 కోట్ల రూపాయలు రుణం వచ్చేట్లు పత్రాలు సృష్టించారు . భూముల మార్కెట్ విలువను పెంచి రుణం పొందడంలో కొన్ని బ్యాంకుల అధికారుల కుట్రతోపాటు, రెవెన్యూ అధికారుల పాత్ర ఉన్నట్లు తెలుస్తుంది. కేసు విచారణలో బాధ్యులైన రెవెన్యూ అధికారులనికూడా సీబీఐ అరెస్ట్ చేసే అవకాశముంది. ఆస్తుల అసలు విలువకు 4 రెట్లు అధికంగా రుణం తీసుకోవడంలో నారాయణ రెడ్డి మోసపూరిత చర్యలకు పాల్పడ్డారని, బ్యాంకులని దగా చేయాలన్న కుట్రతోనే ఇదంతా చేసారని సీబీఐ కేసుల్ని నమోదు చేసింది.