వైసిపి అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటికి 67వ రోజుకి చేరుకుంది. పాదయాత్రలో భాగంగా శ్రీకాళహస్తి నిజయోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్నారు.అయితే వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. ఏపీలోని 13 జిల్లాలకు చెందిన వైసిపి అభిమానులు తమ నేత పాదయాత్రలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. వీరితో పాటు స్థానిక నియోజకవర్గాల వైసిపి క్యాడర్, పెద్ద సంఖ్యలో ఆయా ప్రాంతాల ప్రజలు జగన్ అడుగులో అడుగు వేస్తున్నారు. దాంతో జగన్ యాత్రలో జోష్ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఈ నేపధ్యంలో నిన్న ( శనివారం ) జగన్ కేవలం 12. 8 కిలోమీటర్లు మాత్రమే నడిచారు. ఇప్పటి వరకూ జగన్ 896.4 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేశారు.ఈరోజు కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే పాదయాత్ర కొనసాగనుంది. రచ్చగున్నేరు, ఇసుకగుంట, కాపు గున్నేరు క్రాస్ రోడ్స్, తాండమాన్ పురం క్రాస్ రోడ్స్, చెర్లోపల్లి, మిట్ట కండ్రిగ, టీఎంవీ కండ్రిగ క్రాస్ రోడ్స్, పానగల్ వరకూ జరుగుతుంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం శ్రీకాళహస్తి పట్టణానికి జగన్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈరోజు జగన్ 900 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనున్నారు.