రాష్ట్ర గవర్నర్ నరసింహన్ టీఆర్ఎస్ ఏజెంట్ అని నిందించడం నీచ రాజకీయమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గవర్నర్ హోదాను కాంగ్రెస్ నాయకులు అప్రదిష్ట పాలుజేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులలో అసహనం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
కాళేశ్వరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సమీక్ష ముగిసిన నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.. 8 సంవత్సరాల కాలంలో ప్రాణహిత-చేవెళ్ల ఒక్క అడుగు ముందుకు వేయలేదని అయితే…కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించడంతో గవర్నర్ పెద్ద నేరం చేసినట్టు,పాపం చేసినట్టు మాట్లాడడం నాయకులకు తగదని అన్నారు. గవర్నర్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం సరైంది కాదని…గవర్నర్ కు తక్షణం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
`గవర్నర్ సుదీర్ఘ కాలంగా రాష్ట్రానికి ఆయన సేవలందిస్తున్నారు. ఆయనకు ఎవరి రాజకీయ భిక్ష అవసరం లేదు.కాంగ్రెస్ నాయకులు అధికార దాహంతో, స్వార్థంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు.గవర్నర్ కు రాజకీయాలు అంట గట్టడం తగదు.ఆయన రాజకీయాలకు అతీతంగా ఉన్న మనిషి. మమ్మల్ని ఎవరు మెచ్చుకున్నా వారు టీఆర్ఎస్ ఏజెంట్ లు అవుతారా?కేంద్ర జలసంఘం సభ్యులు, కేంద్ర మంత్రి గడ్కరీ కూడా ఎజెంట్లేనా?జానారెడ్డి గ్రేటర్‌లో 5 రూపాయల భోజనం పెట్టె కార్యక్రమాన్ని మెచ్చుకున్నందుకు ఆయనను టీఆర్ఎస్ ఏజెంట్ గా ఆరోపించారు. కర్ణాటక మంత్రి రేవన్న తెలంగాణ లో గొర్రెల పంపిణీని మెచ్చుకున్నందుకు ఆయనను ఎజెంట్ అన్నారు` అంటూ మండిపడ్డారు. దివాళా కోరు రాజకీయాలు చేస్తున్నారు అంటూ ఆక్షేపించారు.