వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 65 రోజులు పూర్తి చేసుకుని నేడు 66వ రోజు కొనసాగనుంది. అయితే, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తి అయి ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను వింటున్నారు జగన్. దీంతో ప్రజలు వైఎస్ జగన్ పాదయాత్రకు బ్రహ్మరథంపడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. నిత్యం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రచిస్తూ ఇలా జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
అయితే, ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లా మోదుగుపాలెం క్రాస్‌రోడ్డు వద్ద కొనసాగుతోంది. ఈ సందర్భంగా తనను కలిసిన మహిళలతో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో రైతులు, నిరుద్యోగులు, ప్రజలు మోసపోతున్నారని, ఆ మోసాలను ప్రజలకు చెప్పాలనే తాను పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే చిట్టి తల్లులు, చిట్టి పిల్లలను బడికి పంపిస్తే బడికి పంపించినందుకుగాను ఆ తల్లికి ప్రతి సంవత్సరం 15వేలు ఇస్తామన్నారు. ఆ చిట్టి తల్లులు, పిల్లలు చదువుకుంటేనే మన బతుకులు మారుతాయన్నారు. నా మనవడు వచ్చాడు.. అధికారంలోకి వచ్చాక రూ.2వేలు పింఛన్ ఇస్తానన్నాడని తాతకు చెప్పు అని ఓ వృద్ధురాలిని ఉద్దేశించి జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. అలాగే, సున్నా వడ్డీ రుణాలు ఇస్తామన్నారు. అనంతరం ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ జగన్ మోహన్‌రెడ్డి తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.