విశాఖపట్నం జిల్లాలో బాహుబలి సినిమా మొదటి పార్ట్ సీన్ ఒకటి రిపీటైంది. బాహుబలి మొదటిపార్ట్‌లో శివగామి పాత్రలో ఉన్న రమ్యకృష్ణ చేసిన సీన్ అదేనండీ.. ఒక శిశువుని చేత్తోపట్టుకుని అలాగే నీళ్లలో ఉండటం. ఇలా ఆ శిశువు ప్రాణాలను రమ్యకృష్ణ బాహుబలి చిత్రంలో కాపాడితే.. ఇక్కడ మాత్రం తన కుమారుడి ప్రాణాన్ని కాపాడింది ఓ తల్లి. అయితే, ఈ ఘటన జరిగింది బాహుబలి చిత్రంలోలాగా నీళ్లలో కాదండీ… రోడ్డుపై. చివరకు శివగామిలానే.. ఈ తల్లీ తన ప్రాణాలను కోల్పోయింది.
ఇక అసలు విషయానికొస్తే.. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం పరిధిలోగల పైకివాడ గ్రామంలో బండా శ్రీను, గౌరి అనే దంపతులు కాపురం ఉంటున్నారు. వారికి కుశాల్ వర్ధన్, హేమ రఘురామ్ అనే ఇద్దరు సంతానం. అయితే, సంక్రాంతి పండుగ సందర్భంగా పెందుర్తి మండలం గండిగూడలోని తమ బంధువుల ఇంటికెళ్లి బైక్‌పై వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, వీరు బైక్‌పై రోడ్డుపై వెళ్తున్న క్రమంలో వీరి వెనుక ఒక ఆర్టీసీ బస్సు వచ్చింది.
ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయిన ఆర్టీసీ డ్రైవర్ వీరి బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీను, గౌరికుశాల్ వర్ధన్ రోడ్డుకు పక్కనే ఉన్న తుప్పల్లో పడ్డారు. గౌరి ఒడిలో కూర్చొన్న హేమరఘురామ్ రోడ్డుపై పడ్డారు. అయినా హేమరఘురామ్‌ను వదల్లేదు గౌరి. రోడ్డుపై పడ్డ వారిద్దరి వైపుగా బస్సు వస్తుండటంతో గమనించిన గౌరి హేమరఘురామ్‌ను పక్కనే ఉన్న తుప్పల్లోకి విసిరేసింది. ఇలా హేమరఘురామ్ బతికిబట్టగట్టాడు. అయితే, బస్సు గౌరి మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఇప్పుడీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.