గత సంవత్సరం డిసెంబర్‌లో చోటు చేసుకున్న చిత్తూరు ఘటనలో రాజేష్, శైలజ ఉదంతం సంచలన వార్తగా మారిపోయిన సంగతి తెలిసిందే..మొదటిరాత్రే రాజేష్ సంసార జీవితానికి పనికిరాడని తెలుసుకున్న శైలజ కాస్సేపటి తర్వాత బయటకు వచ్చేసింది. తల్లితండ్రులకు విషయాన్ని వివరించింది. అయినా తల్లితండ్రులు నచ్చజెప్పారు. తిరిగి గదిలోకి ఆమెను పంపారు. జీవితానికి పనికిరాననే విషయాన్ని తల్లితండ్రులకు చెప్పిందనే కోపంతో రాజేష్ రాక్షసంగా ప్రవర్తించాడు. నవ వధువును విచక్షణా రహితంగా కొట్టాడు. అంతేగాకుండా పంటితో విపరీతంగా కొరికి గాయపరిచాడు. నోట్లో గుడ్డలు కుక్కి కళ్లు, ముఖం వాచేలా చిత్రహింసలకు గురిచేశాడు. మొదటిరాత్రి రోజే.. అల్లుడి శాడిజాన్ని చూసిన శైలజ తల్లిదండ్రులు గంగాధరనెల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, రాజేష్ తో పాటు అతని తండ్రిని సైతం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అయితే రాజేష్‌కు చిత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బెయిల్‌పై శుక్రవారం విడుదలైన సందర్భంగా రాజేష్ మీడియాతో మాట్లాడాడు. ‘ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 45 రోజుల పాటు నా కన్నతల్లిని చూడకుండా చేశారు. పైగా నేను మగాడ్ని కాదంటూ, సంసారానికి పనికిరాడని నాపై అభాండాలు వేశారు. నేను మగాడ్నే. మెడికల్ బోర్డు కూడా నా లైంగిక పటుత్వ పరీక్షలు పరీక్షించి ఎలాంటి లోపం లేదని నివేదిక ఇచ్చింది.’ పోలీసుల దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానన్నాడు. శైలజ తనపై చేసిన ఆరోపణలన్నీ అబద్దమన్నాడు. తనను శాడిస్ట్‌తో పోల్చొద్దంటూ కోరాడు.