టెక్స్‌టైల్ రంగం సమగ్రాభివృద్ధి కోసం సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కే.తారకరామారావు కోరారు. సిరిసిల్ల పవర్ లూమ్ సెక్టార్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి కేంద్రం అండగా ఉండాలన్నారు. కాంప్రహెన్సివ్ పవర్‌లూం క్లస్టర్ డెవలప్‌మెంట్ స్కీం క్రింద సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర టెక్స్ టైల్ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీకి లేఖ రాశారు.
ఆ లెటర్ లోని వివరాలు ఇవి….“సిరిసిల్ల ప్రాంతంలోని సుమారు 80 శాతం మందికి పవర్ లూమ్ రంగంపైనే ఆధారపడి ఉన్నాయి. దాదాపు 36 వేల పవర్ లూమ్స్ ఇక్కడ ఉన్నాయన్నారు. అయితే మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా లూమ్స్ ను అప్ గ్రేడ్ చేసుకోకపోవడంతో విద్యుత్ వినియోగం అధికంగా అవుతోంది. ఇంతేకాకుండా పెట్టుబడి స్థోమత లేకపోవడంతో ముడిసరుకు కోసం వ్యాపారులపైనే ఆధారపడాల్సిన దుస్థితిలో సిరిసిల్ల పవర్ లూమ్ రంగం ఉంది. నైపుణ్యం గల కార్మికులతో పాటు మౌలిక సౌకర్యాల కొరత వేధిస్తోంది. ఈ సమస్యలతో దేశంలోని మిగతా పవర్ లూమ్ పరిశ్రమతో సిరిసిల్ల పోటీపడలేకపోతుంది` అని చెప్పారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్ల పవర్ లూమ్ రంగానికి తక్షణ ఉపశమనం కలిగించేందుకు కొన్ని చర్యలు తీసుకుందన్నారు.
ఇందులో భాగంగానే స్కూల్ యూనిఫాంలతో పాటు ఆయా ప్రభుత్వ కార్యక్రమాలకు అవసరమైన చీరల ఆర్డర్ లను ఇచ్చిందని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. వీటితో పాటు ఈ రంగాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం థ్రిఫ్ట్ ఫండ్, అప్పరల్ పార్క్ అభివృద్ధి, వర్కర్ టూ ఓనర్ స్కీం,యార్న్ బ్యాంక్ ఫండింగ్, యార్న్ సబ్సిడీతో పాటు ప్రభుత్వ విభాగాలకు అవసరమైన దుస్తులను కొనడం వంటి కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. అయితే సిరిసిల్ల పవర్ లూమ్ రంగం సమగ్రాభివృద్ధి కోసం మరిన్ని చర్యలు అవసరమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందన్నారు. CPCDS లో భాగంగా ఇక్కడ మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను ఏర్పాటుచేస్తే ఈప్రాంతంలోని పవర్ లూమ్ రంగంపై ఆధారపడ్డ వేలాది మందికి గరిష్ట ప్రయోజనం కలుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. 2013-14 సంవత్సరంలో ఈరోడ్,భీవండి ప్రాంతాల్లో మెగా పవర్ లూమ్ క్లస్టర్ లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిందన్న మంత్రి కేటీఆర్, వాటి ఏర్పాటుతో అక్కడ గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. సిరిసిల్లలో కూడా అలానే మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటుచేయాలని కోరారు.
Post Views: 189