దాదాపు 60సంవత్సరాల సమైక్యపాలనలో తెలంగాణ నీళ్లన్నీ దోచుకెళ్లిన ఏపీ సర్కారు .. ఇప్పుడు మరో భారీ కుట్రకు తెర లేపింది. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట పండదంటూ విష ప్రచారం మొదలుపెట్టారు. వరి పంటకు ఏపీయే కేంద్రమంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వరి పండని తెలంగాణకు నీళ్లెందుకంటూ కొత్త డ్రామా ఆడుతున్నారు.తెలంగాణ భూములు వరి పంటను సాగు చేయడానికి అనుకూలమైనవి కావు. పైగా వ్యవసాయ వాతావరణం కూడా అందుకు సహకరించదు. కాదూ కూడదని వరి సాగు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. పెట్టుబడిని నష్టపోతారంటూ ఏపీ సర్కారు మరోసారి తన కపటనీతిని బయటపెట్టింది. కేవలం ఆరుతడి లేదా వర్షాధార పంటలనే వేసుకోండి అంటూ ఉచిత సలహానిచ్చింది. కృష్ణా నీటిని ఏపీకి వదలండి అంటూ కృష్ణా ట్రైబ్యునల్ ముందు సమర్పించిన అఫిడవిట్‌లో ఆంధ్రప్రదేశ్ సర్కారు పేర్కొన్నది. మరోసారి కృష్ణా నీటిని తమ ప్రాంతానికి దోచుకెళ్లేందుకు విష ప్రచారం చేస్తోంది.
రెండు రాష్ర్టాల మధ్య కృష్ణా జల వివాదాన్ని పరిష్కరించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ట్రైబ్యునల్ ఇప్పటికే పలుమార్లు సమావేశమై ఇరు రాష్ట్రాల వాదనలను విన్నది. ఈ నెల (జనవరి) 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు ట్రైబ్యునల్ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఈ నేపథ్యంలో సమావేశం కోసం ఏపీ సర్కారు వ్యవసాయ శాస్త్రవేత్త పాలడుగు వెంకట సత్యనారాయణతో ప్రత్యేక అఫిడవిట్‌ను దాఖలు చేయించింది.నిజానికి వరి దిగుబడిలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల కంటే కరీంనగర్ జిల్లా వరిపంట ఉత్పత్తిలో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నది. ఇక నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ వరిసాగు అధికంగానే ఉంది. దిగుబడి విషయంలో ఎక్కడా నష్టపోయిన దాఖలాలు లేవు. తాజాగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, రైతులకు పంట పెట్టుబడితో తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికే ఆదర్శంగా మారనుంది.