తెలంగాణ మరో తీపికబురును అందుకుంది. సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టు స్టేజ్-1కు అటవీ అనుమతి లభించింది. ప్రాజెక్టు ప్రతిపాదనలపై అటవీ, పర్యావరణ ప్రాంతీయ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. 1531 హెక్టార్ల అటవీ భూములను ఇరిగేషన్ శాఖకు బదలాయించేందుకు అంగీకరించింది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీకానున్నాయి. అటవీ అనుమతి లభించడంపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తలపెట్టింది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ స్టేజ్-1 కు చెన్నైలో సమావేశమైన ప్రాంతీయ అటవీ, పర్యావరణ సాధికార కమిటీ అనుమతులను జారీ చేసింది. ప్రాజెక్టు ప్రతిపాదనలపై సీఈ సుధాకర్.. కమిటీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ప్రతిపాదనలపై అటవీ, పర్యావరణ ప్రాంతీయ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. 1531 హెక్టార్ల అటవీ భూములను ఇరిగేషన్ శాఖకు బదలాయించేందుకు అంగీకరించింది.
సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల దశ మారనుంది. మహబూబాబాద్ జిల్లాలో కొంత భాగానికి నీరు ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. రూ.9వేల కోట్లతో గోదావరి నదిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం ఆనకట్ట ఎగువ జలాలను టేకులపల్లి మండలంలోని రోళ్లపాడు రిజర్వాయర్‌కు తరలించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. గతేడాది సీఎం కేసీఆర్ దీనికి శంకుస్థాపన చేశారు.
దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టును రద్దు చేసి దాని స్థానంలో సీతారామ ప్రాజెక్టును రీ డిజైనింగ్ చేశారు. ఇందులో భాగంగా గోదావరి నుంచి 77.76 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. దుమ్ముగూడెం ఆనకట్ట ఎగువ నుంచి పాములపల్లి దగ్గర ఏర్పాటు చేసిన ప్రత్యేక పంపుహౌస్ నుంచి నీటిని తరలిస్తారు. రోజుకు తొమ్మిది వేల క్యూసెక్కుల నీరు చొప్పున 100 రోజులపాటు పంపింగ్ చేస్తారు. ఐదుచోట్ల పంప్‌హౌస్‌లు నిర్మించనున్నారు. నాలుగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను కూడా ఏర్పాటు చేస్తారు.
ప్రాజెక్టు కోసం ప్రభుత్వ, ప్రైవేట్ భూములతో పాటు అటవీ భూములను సేకరించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు చాలా వరకు భూసేకరణ పూర్తయ్యింది. అటవీ అనుమతి రావాల్సి ఉంది. ఇవాళ ప్రాజెక్టు స్టేజ్ వన్ కు అటవీ అనుమతి లభించడంతో పనులు మరింత వేగవంతం కానున్నాయి. అటు ప్రాజెక్టు స్టేజ్ వన్ కు అనుమతులపై మంత్రులు హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కు, మంత్రి హరీశ్ రావు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు.