ఏపీలో మరో దారుణం జరిగింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతూ కళాశాల వసతి గృహంలో ఉంటున్న ఓ విద్యార్థినికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో గర్భిణి అని వైద్యులు నిర్ధారించడం.. ఆ తరువాత ఆమె ప్రసవించడంతో వసతి గృహ సిబ్బందికి తితిదే అధికారులు మెమోలు జారీ చేశారు. వసతి గృహ విద్యార్థినుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు వార్డెన్ కుమారి, డిప్యూటీవార్డెన్లు విద్యుల్లత, శిరీష, మాట్రిన్ కావమ్మలను వివరణ కోరుతూ తితిదే విద్యాశాఖాధికారి రామచంద్ర గురువారం మెమోలు ఇచ్చారు. గుంటూరు జిల్లా జొన్నలగడ్డకు చెందిన డిగ్రీ విద్యార్థిని.. డిసెంబరు 31న కడుపునొప్పిగా ఉందని హాస్టలు సిబ్బందితో చెప్పడంతో, వారు ఆమెను తితిదే సెంట్రల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు విద్యార్థిని గర్భిణి అని నిర్ధారించారు. ఆ తరువాత తిరుపతిలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంకు తరలించగా.. జనవరి 1వ తేదీన ప్రసవించింది. వసతి గృహ సిబ్బంది ఆమెను పురిటిబిడ్డతో సహా తల్లిదండ్రుల ద్వారా స్వగ్రామానికి పంపించారు. ఈ వ్యవహారంపై తితిదే విద్యాశాఖ విచారణ చేయాల్సిందిగా విజిలెన్స్ కోరడంతో ఈనెల 13నుంచి కళాశాల వసతి గృహంలో విచారణ చేపట్టారు.
