అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఏపీ సీఎం, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీని తెరాసలో విలీనం చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా ఎన్ని పనులు ఉన్నా చంద్రబాబు హైదరాబాద్ రావాల్సిందని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో టీడీపీ అంతరించిపోయిందన్న వాతావరణం నెలకొందని మోత్కుపల్లి నిర్మోహమాటంగా వాస్తవ పరిస్థితులు వివరించారు. భుజాన ఎత్తుకొని పార్టీ కాపాడుకుందామన్న సహకరించే వారు లేరని ఆయన వాపోయారు. పార్టీ అంతరించి పోయింది, మనుగడే లేదనే కామెంట్ల కన్నా టీఆర్ఎస్ లో విలీనం చేయటం మంచిదని చంద్రబాబును కోరారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితిలో ఇక్కడ పార్టీకి సమయం కేటాయించలేరని అందుకే తెలంగాణలో తెలుగుదేశం ఓటు బ్యాంకు, పార్టీ కార్యకర్తల కోసం టీఆర్ఎస్‌లో విలీనమే మంచిదని మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు