కుటుంబ పాలనపై, తనపై వస్తున్న విమర్శలకు తెలంగాణ సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా గులాబీ దళపతి ఇచ్చిన క్లారిటీ పరోక్షంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశించినట్లుగా ఉందని పలువురు అంటున్నారు. ఇంటకీ ఏం జరిగిందంటే హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్ లో ‘ఛాలెంజ్ ఆఫ్ చేంజ్: యంగ్ స్టేట్, న్యూ యాస్పిరేషన్స్’ అంశంపై సీఎం కేసీఆర్ ను సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.
ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు మంత్రులు, ఎంపీగా మీ కుటుంబ సభ్యులే ఉన్నారన్న ప్రశ్నకు సీఎం కేసీఆర్ సూటిగా సమాధానం చెప్పారు. ముగ్గురు కాదు యావత్ తెలంగాణ రాష్ట్రమే తన కుటుంబం అన్నారు. తన కుటుంబ సభ్యులు తెలంగాణ కోసం ఉద్యమాల్లో పాల్గొన్నారని, కేసులు ఎదుర్కున్నారని, జైలుకు వెళ్లారని వివరించారు. ఈ విషయం ప్రజలందరికి తెలుసన్నారు.తన కుటుంబ సభ్యులు ప్రజలు ఎన్నుకుంటేనే పదవుల్లోకి వచ్చారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వాళ్లెవరికీ తాను నామినేటెడ్ పదవులు కట్టబెట్టలేదన్నారు. ప్రజలు ఆమోదిస్తేనే ఎవరైనా ఎన్నికవుతారని గుర్తుచేశారు.
అయితే, సీఎం కేసీఆర్ ఇచ్చిన ఈ సూపర్ రిప్లైపై సోషల్ మీడియాలో పలువురు ఆసక్తికర రీతిలో స్పందిస్తున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులైన మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత, మంత్రి హరీశ్‌రావు ఉద్యమంలో ఉండి….ఎన్నికల బరిలో నిలిచి ప్రజాప్రతినిధులుగా ఉన్నారని అయితే ఏపీ సీఎం చంద్రబాబు తనయుడైన మంత్రి లోకేష్ మాత్రం దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేసి మంత్రిగా చేశారని పలువురు సెటైర్లు వేస్తున్నారు.