మద్యం మత్తులో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కొడుకు కారుతో వీరంగం సృష్టించాడు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, బాధితులు, పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. వియవాడ పిన్నమనేని పాలిక్లీనిక్ రోడ్డు సమీపంలో అతివేగంగా దూసుకొచ్చిన ఏపీ09సీఈ5567 నెంబర్‌గల కారు ఎదురుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ ప్రైవేట్ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ ఘటన అనంతరం కారులో నుంచి జలీల్ ఖాన్ కొడుకు సాహుల్‌ఖాన్ బయటకు వచ్చాడు. దీంతో మీడియా, పోలీసులు ఫో టోలు తీయడంతో.. ఫోటోలు ఎందుకు తీస్తున్నారంటూ సాహుల్ ఖాన్ పో లీసులకు ఎదురుతిరిగాడు. నేను ఎమ్మెల్యే కొడుకును, గవర్నమెంట్ నాది అంటూ పోలీసులపై తిట్లవర్షం కురిపించాడు.
తన కొడుకు ఇలా రోడ్డు ప్రమాదంలో కేసులో మీడియా సాక్షిగా పోలీసులకు దొరకడంతో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ రంగంలోకి దిగి, తన కొడుకును బయటపడేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే, మరో పక్క సాహుల్ ఖాన్ నడిపిన కారు 130 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో బైక్‌పైకి దూసుకొచ్చిందని, ఈ ప్రమాంలో ఓ ప్రైవేటు ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడని స్థానికులు చెబుతున్నారు.
