తెలంగాణ ఉద్యమకారులు, పొట్ట చేత పట్టుకొని విదేశాలకు వెళ్లిన వారికి తెలంగాణ సీఎం కేసీఆర్ తీపికబురు తెలిపారు. తెలంగాణ ఎన్నారై పాలసీని రూపొందిస్తున్నామని, త్వరలోనే అది అమలులోకి వస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నారై పాలసీతో గల్ఫ్ బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 1969 తెలంగాణ ఉద్యమకారులను త్వరలోనే సమున్నతంగా గౌరవించుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు.
ఇప్పటికే కొంతమందికి సహాయం చేశామన్నారు. హైదరాబాద్ లో జలదృశ్యం పక్కన 1969 ఉద్యమ అమరవీరుల స్తూపం నిర్మిస్తున్నామని వెల్లడించారు. అది పూర్తయిన తర్వాత ఆనాటి ఉద్యమకారులతో ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలువబోతోందని సీఎం కేసీఆర్ చెప్పారు.
రైతులకు ఎరువులు, విత్తనాల కష్టాలు లేకుండా చేశామన్నారు. ఈ ఏడాది నుంచి రైతులకు ఎకరాకు రూ. 8 వేల చొప్పున పెట్టుబడి అందిస్తున్నామని తెలిపారు. దీనిద్వారా 71 లక్షల మంది రైతులకు లబ్ధి జరుగుతుందన్నారు. గోదాముల సామర్థ్యం 23 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామని, రైతులకు మద్దతు ధర కల్పించేందుకు సమన్వయ సమితులు ఏర్పాటు చేశామని వివరించారు.