చంద్రబాబు సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ప్రాంతంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న చౌదరయ్య అనే వ్యక్తి రాసిన లేఖతో చంద్రబాబు ప్రతిష్ట మోడీ సర్కార్ ముందు మసకబారినట్లయింది. అయితే, పోలవరం ప్రాజెక్టులో దారుణమైన అవినీతి జరుగుతుందని, నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ పనులు చేయిస్తోందని, అంతేగాక, పురుషోత్తమ పట్టణ ప్రాజెక్టుకు పోలవరం నిధులను ఖర్చు చేస్తూ కేంద్రానికి తప్పుడు లెక్కలు చూపిస్తోందని మోడీ సర్కార్‌కు లేఖ రాశారు చౌదరయ్య అనే వ్యక్తి. అయితే, ఈ విషయాలన్నీ సమాచార హక్కు చట్టం ప్రకారం వేసిన ఆర్టీఐ అర్జీ ద్వారా తెలుసుకున్నట్లు చౌదరయ్య మీడియాకు తెలిపారు. చౌదరయ్య ఫిర్యాదుకు స్పందించిన పీఎంఓ కార్యాలయం.. ఫిర్యాదు దారుడు సంతృప్తి చెందేలా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో విచారణ చేపట్టిన పీఎంఓ కార్యాలయం.. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి, అలాగే ఏపీ జలవనరులశాఖ ఈఎస్ఈని వివరాలను కోరింది.
అయితే, చౌదరయ్య తన భూమిని పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకంలో కోల్పోయానని, తనవద్ద నుంచే కాకుండా పలువురు రైతుల నుంచి వేల ఎకరాల భూమిని పురుషోత్తమ పట్నం ప్రాజెక్టు కోసమంటూ ధౌర్జన్యంగా, పోలీసు దాడుల నడుమ, అధికారాన్ని అడ్డంపెట్టుకుని లాక్కున్నారన్నారు. దీంతో తనతోపాటు అనేక మంది రైతులు భూమిని కోల్పోయారన్నారు. 2013 భూ సేకరణ చట్టం కింద నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పర్యావరణ, అటవీ అనుమతులు లేవని, మరి పోలవరం నిధులను పురుషోత్తమపట్నం ప్రాజెక్టు కోసం ఖర్చుపెడుతూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతుందని చౌదరయ్య రాసిన లేఖలో పేర్కొన్నారు.