కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీతో తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఢిల్లీలో బుధవారం సమావేశమయ్యారు. వ్యవసాయానికి ఆర్థిక సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు పంపిణీకి సంబంధించి మే నెలలో రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్న నేపథ్యంలో బ్యాంకుల్లో నగదు అందుబాటులో ఉంచాలని కేంద్ర మంత్రిని మంత్రులు పొచారం శ్రీనివాస రెడ్డి,హరీష్ రావు కోరారు.
నార్త్ బ్లాక్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైన అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎకరానికి 4వేల రూపాయలు పంట పెట్టుబడిగా ఇవ్వాలని దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పోచారం గుర్తు చేశారు. ప్రతి పంటకు రూ. 6 వేల కోట్లు అవుతుందని అంచనా వేశామన్నారు. పంట పెట్టుబడిని చెక్కుల రూపంలో రైతులకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
బ్యాంకుల్లో తగినంత కరెన్సీ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని కోరామని మంత్రి పోచారం వివరించారు. డ్రిప్ ఇరిగేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా సబ్సిడీ ఇస్తుందని మంత్రి పోచారం తెలిపారు. డ్రిప్, ఇరిగేషన్ పరికరాలపై పడుతున్న జీఎస్టీ భారాన్ని తగ్గించాలని కోరామని వివరించారు. దేశంలోనే రైతులకు అత్యధిక సబ్సిడీ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని పేర్కొన్నారు.