తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మం తెలంగాణ భవన్‌లో జర్నలిస్టులతో మంత్రి తుమ్మల చిట్ చాట్ చేశారు. పదవి ఉంటుంది పోతుందని… కానీ చేసిన అభివృద్ధి శాశ్వతంగా నిలిచిపోతుందని మంత్రి తెలిపారు. విశాలమైన రోడ్లు అభివృద్ధికి సూచికలని, ఒక రోడ్డు వేస్తే అభివృద్ధి అదే వస్తుందని మంత్రి తుమ్మల అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ హయాంలో వేసిన రోడ్లకు పదేళ్ల గ్యారంటీ ఇస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు వేసిన రోడ్లు పోతే తమను నిందించడం సరికాదని ఆయన అన్నారు. రోడ్ల విస్తరణ అవసరాన్ని మీడియా ప్రజల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. చాలా రోడ్లు విస్తరించాలని ప్రయత్నించినా… ప్రజల సహకారం లేక ఆలస్యమవుతోందని తుమ్మల తెలిపారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖంగా ఉన్నారని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రభుత్వ వెసులుబాటు బట్టి స్థలాలు కేటాయిస్తామన్నారు. సీనియారిటీ ప్రకారం జర్నలిస్టులు జాబితా ఇవ్వాలని ఆయన సూచించారు.