వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేతన అయిన చంద్రబాబు సొంత జిల్లాలో దుమ్ము రేపుతోంది. బాబు ఇలాకాలో జగన్‌కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలతోనే సంక్రాంతి జరుపుకున్న జగన్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి నగరి నియోజకవర్గానికి పాదయాత్రగా చేరుకున్నారు. నగరి నియోజకవర్గానికి వైసీపీ ఎమ్యెల్యే ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తూవుండటంతో వేలసంఖ్యలో జనం జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన సభలో చంద్రబాబు పై జగన్ సంచలన వ్యాఖ్యలే చేశారు.
నగరి నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుంచి అనేక మంది తమ కన్నీటి గాథలను చెబుతూనే, అన్నా.. నీకు తోడుగా ఉంటాం అని నా భుజం తడుతున్నారు. పాదయాత్ర మొదలైనప్పటి నుంచి చాలా మంది రైతులు వచ్చి అన్నా.. ఇదే నియోజకవర్గంలో రేణిగుంట షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అది సహకార రంగంలో ఉండేది. మా జిల్లాలో మొత్తం ఆరు చక్కెర ఫ్యాక్టరీలు ఉంటే అందులో రెండు సహకార రంగంలోనివి. మా ఖర్మ ఏంటంటే చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా కూడా సహకార ఫ్యాక్టరీలు మూత పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సహకార ఫ్యాక్టరీలు నడిస్తే రైతులకు మంచి రేట్లు వస్తాయని చెప్పారు.
ఇక చంద్రబాబు గతంలోనూ.. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు రెండు సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. రైతులు అవస్థలు పడే పరిస్థితి వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే 51 కోట్ల రూపాయలు ఇచ్చి వాటిని తెరిపించారు. నాన్నగారి పుణ్యమా అంటూ పదేళ్ల పాటు రైతులు సంతోషంగా ఉన్నారు. మళ్లీ నాలుగేళ్ల కిందట చంద్రబాబు సీఎం కావడంతో ఆ రెండు చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. చంద్రబాబు దగ్గరుండి మరీ రైతులను నాశనం చేస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లాకు గాలేరు నగరి, హంద్రీ నీవా ప్రాజెక్ట్ లు వున్నా కాలువలు లేకుండా చేసి పంటలు పండించుకునే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు ఇతర వివరాలను కూడా జగన్ వెల్లడించారు. ఇక జగన్ ప్రసంగాలకు ప్రజలనుంచి మంచి స్పందన లభించడంతో వైసీపీ శ్రేణుల్లో జోరు పెరిగింది.