వచ్చే విద్యా సంవత్సరం నుంచి ములుగు జాకారంలో గిరిజన యూనివర్శిటీ, వరంగల్ లోని మామునూరులో వెటర్నరీ కాలేజీ ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఈ రెండింటిలో 2018 విద్యా సంవత్సరం జూన్ నుంచి తరగతులు ప్రారంభించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సచివాలయంలో నేడు ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి వరంగల్ లోని మామునూరు వెటర్నరీ కాలేజీలో అడ్మిషన్లు తీసుకునేందుకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లెటర్ రాశామని అధికారులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దృష్టికి తీసుకొచ్చారు.వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు కూడా మామునూరు వెటర్నరీ కాలేజీని సందర్శించారన్నారు. కాలేజీ కోసం 2016లో తెలంగాణ ప్రభుత్వం పివి నరసింహ్మరావు తెలంగాణ వెటర్నరీ కాలేజీకి 6 కోట్ల రూపాయలకు అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇచ్చారని తెలిపారు.
ఆ తర్వాత కాలేజీ భవనాలు, మౌలిక వసతులు, ల్యాబ్ ల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం 2017లో 109. 69 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఇప్పటికే భవనాలకు శంకుస్థాపనలు చేశామని, వీటి నిర్మాణాలు వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు.